YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో 75 శాతం పెరిగిన జడ్జీల సంఖ్య

తెలంగాణలో 75 శాతం పెరిగిన జడ్జీల సంఖ్య

హైదరాబాద్, జూన్ 9,
తెలంగాణ ప్రభుత్వం ఎంతో కాలంగా సుప్రీంకోర్టుకు చేస్తున్న విజ్ఞప్తులకు తాజాగా పరిష్కారం లభించింది. హైకోర్టులో జడ్జిల సంఖ్య 75 శాతం పెంచుతూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చొరవతోతెలంగాణ హైకోర్టు చిరకాలవాంఛ నెరవేరినట్లయింది. తెలంగాణలో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంచుతూ సీజేఐ బుధవారం నిర్ణయం తీసుకున్నారు.హైకోర్టు న్యాయమూర్తుల నియామకం అనేది సుప్రీంకోర్టు కొలీజియం ద్వారా జరుగుతుంది. అయితే, న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు అనేక విజ్ఞప్తులు అందాయి. అంతేకాక, వివిధ రాష్ట్రాల హైకోర్టుల నుంచి కూడా ఇలాంటి విజ్ఞప్తులు వచ్చాయి. వీటిని జస్టిస్‌ ఎన్వీ రమణ పరిశీలించారు. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75 శాతం వరకు పెంచేట్లు నిర్ణయం తీసుకున్నారు.దీంతో ఇకపై తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు చేరనుంది. హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం వెల్లడించింది. ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో రెండ్రోజుల పాటు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ అయిన జస్టిస్‌ ఎన్వీ రమణ... కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Related Posts