విజయవాడ, జూన్ 9,
మంచి కుటుంబం, అబ్బాయి త్వరలోనే విదేశాల్లో స్థిరపడతాడని అమ్మాయి తల్లిదండ్రులు మురిసిపోయారు. కూతురు కూడా ఇష్టపడటంతో భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. అయితే శోభనం రోజు రాత్రే భర్త నపుంసకుడని, సంసారానికి పనికిరాడని తెలిస వధువు కంగుతింది. అయితే ఈ విషయం బయటపెట్టి తన పరువు తీయొద్దని భర్త వేడుకోవడంతో మిన్నకుండిపోయింది. అయితే మనసులోని బాధను ఆపుకోలేక కన్నవారికి చెప్పుకుంది. అక్కడి నుంచి ఆమె కష్టాలు రెట్టింపయ్యాయి. భర్త తీరుతో పుట్టింట్లోనే ఉండిపోయిన ఆమెను అత్తింటివారు వేధించడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పినపాడుకు చెందిన యువతి(20)కి విజయవాడ ఆటోనగర్‌కు చెందిన యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన వివాహం జరిగింది. అతడు ప్రస్తుతం ప్రైవేటు కన్సల్టెన్సీలో పనిచేస్తుండగా... త్వరలోనే ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్తాడని, పెళ్లి చేసుకుని భార్యను కూడా అక్కడికి తీసుకెళ్తాడని తల్లిదండ్రులు చెప్పారు. వీసా, ఇతర పత్రాలన్నీ చూపించడంతో యువతి తల్లిదండ్రులు మంచి సంబంధం దొరరికిందని మురిసిపోయారు. వారు అడిగినట్లుగా రూ.10 లక్షల కట్నం, ఇతర లాంఛనాల కింద మరో రూ.10 లక్షలు ఖర్చు చేసి ఘనంగా వివాహం చేశారు.
వివాహం జరిగిన రోజు కార్యం నిమిత్తం వధువును విజయవాడ తీసుకువెళ్లారు. తొలిరాత్రి గదిలోకి వెళ్లిన ఆమెకు భర్త తాను నపుంసకుడినని, సంసారానికి పనికిరానని చెప్పడంతో షాకైంది. ఈ విషయం బయటపెట్టి తన పరువు తీయొద్దని ప్రాధేయపడ్డాడు. మరుసటి రోజు వరుడి తల్లిదండ్రులు విజయవాడలో రిసెప్షన్ ఏర్పాటు చేయగా యువతి తరుపు బంధువులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతి తన సమస్యను కుటుంబసభ్యులకు చెప్పి భోరుమంది. దీంతో వారు వధువును పుట్టింటికి తీసుకొచ్చేశారు. దీనిపై ఇరుపక్షాల పెద్దలు పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఇటీవల విజయవాడలో పెద్దల సమక్షంలో పంచాయతీ జరగ్గా రిసెప్షన్ కోసం తాము రూ.8 లక్షలు ఖర్చు పెట్టామని, ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని యువకుడు, అతని తరఫు వారు డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా వధువు, ఆమె కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. దీంతో యువతి భర్త, అత్తింటి వారిపై తెనాలి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు