విజయవాడ, జూన్ 9,
ఏపీ సీఎం జగన్ రెడ్డి పర్యటన ఖరారైంది. గురువారం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌లను కలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారైనట్లు తెలుస్తోంది. మిగిలిన మంత్రుల అపాయింట్‌మెంట్ కోసం వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. గతవారమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన జరగాల్సి ఉంది. అయితే కేంద్ర మంత్రులు అందుబాటులో లేకపోవడంతో టూర్ రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం అమిత్ షా సహా కొందరు మంత్రుల అపాయింట్‌మెంట్ దొరకడంతో ఆయన ఢిల్లీ వెళ్తున్నారు.అయితే ఈసారి సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. సొంత పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలసి ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖకు కూడా ఆయన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సీఎం జగన్ టూర్‌పై ఆసక్తి నెలకొంది. రఘురామ వ్యవహారం, బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన ఉత్కంఠ రేపుతోంది.