విజయవాడ, జూన్ 10,
కిరీటం ఎవరి నెత్తిన ఉంటే ఎవరైనా కింగే. ఆ కిరీటాన్ని తీసుకెళ్ళి మరొకరికి పెట్టి కింగ్ మేకర్ కావాలని ఎవరూ అనుకోరు. రాజకీయాల్లో అలా అనుకున్న వారు జీవితకాలంలో కింగ్ కాలేకపోయారు. ఇన్నేళ్లకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆ సంగతి బాగా అర్ధమైందిట. తాను కింగ్ తప్ప మరేమీ కోరుకోవడంలేదని పవన్ తన యాక్షన్ ద్వారా పక్కా క్లారిటీగా తెలియచేస్తున్నాడు. దానికి అవసరం అయ్యే పొత్తులకే ఆయన రెడీ అంటున్నారుట. బీజేపీతో పవన్ కి ఏ పేచీ పూచీ లేదు. ఎందుకంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలకు ముందు ఆ పార్టీ పవన్ కల్యాణ్ తమ సీఎం క్యాండిడేట్ అని గట్టిగానే చెప్పేసింది.ఇపుడు కాకపోయినా రేపటి రోజు అయినా పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు వస్తారు అని చంద్రబాబే కాదు ఆయన అనుకూల మీడియా కూడా కడు నమ్మకంగా ఉన్నాయి. కానీ జరుగుతున్నది వేరు. పవన్ కల్యాణ్ టీడీపీకి మళ్ళీ మద్దతు ఇచ్చే సీన్ లేదని అంటున్నారు. పైగా పొత్తుల పేరిట ఇప్పటికి అయిన అల్లరి చాలని కూడా భావిస్తున్నారుట. టీడీపీకి బీ టీమ్ అంటూ వైసీపీ చేసిన యాగీతో కూడా తమ పార్టీ బాగా నష్టపోయింది అని పవన్ కల్యాణ్ తలపోస్తున్నారుట. అందువల్ల టీడీపీతో దోస్తీకి నై నై అనేస్తున్నారుట. ఏది ఏమైనా తనకు తానుగానే తేల్చుకోవాలన్నది పవన్ ఆలోచనగా ఉందని టాక్.బీజేపీతో పవన్ కల్యాణ్ పొత్తు కొనసాగుతుందిట. కానీ ఏపీ వరకూ పవనే కూటమికి పెద్దన్నగా ఉంటారుట. మెజారిటీ సీట్లు జనసేన పోటీ చేస్తే జూనియర్ పార్టనర్ గానే బీజేపీ ఉండబోతుందిట. అలా బలమైన జాతీయ పార్టీ బీజేపీ మద్దతు తీసుకుని 2024 ఎన్నికలకు పవన్ పోటీ పడబోతున్నారుట. తనకు బలమున్న ప్రాంతాలలో ఈసారి ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే ముఖ్యమంత్రి సీటు ఎందుకు తన దగ్గరకు రాదు అన్నదే పవన్ కల్యాణ్ పంతమని చెబుతున్నారు. అంటే రేపటి రోజున ఏపీలో ట్రయాంగిల్ పోటీ జరిగితే బీజేపీ జనసేన కూటమికి మంచి అవకాశాలు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారుట. ఒకవేళ జగన్ సర్కార్ మీద వ్యతిరేకత ఉంటే దాన్ని టీడీపీకి కాకుండా తమ కూటమే సొంతం చేసుకోవాలంటే కచ్చితంగా విడిగా పోటీ చేయడమే మేలు అనుకుంటున్నారుట.టీడీపీ బీజేపీ కి స్నేహ హస్తం చాచినా కూడా బీజేపీ వెంటనే అలెర్ట్ అయి ఖండించేసింది. దీని వెనక పవన్ కల్యాణ్ ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు తెలివిగా మూడు పార్టీలూ ఒక్కటే అని జనాల్లో గందరగోళం క్రియేట్ చేయడం ద్వారా తమ అవకాశాలు తగ్గిస్తున్నాడు అన్నదే పవన్ కల్యాణ్ ఆలోచనట. అందుకే అర్జంటుగా బీజేపీ నుంచి ఈ కౌంటర్ వచ్చిందని అంటున్నారు. ఇక రేపటి రోజున మెజారిటీకి సరిపడా సీట్లు రాకున్నా కూడా గణనీయమైన సీట్లు తెచ్చుకుంటే ముఖ్యమంత్రి సీటుకే పోటీ పడేందుకు బేరమాడే శక్తి వస్తుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారుట. అంటే 2024లో విగరస్ గా కూటమి తరఫున ప్రచారం చేయడం ద్వారా త్రిశంకు సభను ఏరికోరి తీసుకురావాలి అన్నది పవన్ కల్యాణ్ టార్గెట్ అంటున్నారు. ఎన్నికల తరువాత అవసరం అయితే టీడీపీ లాంటి వాటి సాయం తీసుకుని గద్దెనెక్కవచ్చు అన్నది కూడా వ్యూహంగా ఉందిట. మొత్తానికి పవన్ మాస్టర్ ప్లాన్ వెనక ఆయన అన్న చిరంజీవి కూడా ఉన్నారని చెబుతున్నారు. మొత్తానికి మెగా బ్రదర్స్ రాజకీయంతో ఏపీ రాజకీయాల్లో 2024 పెద్ద సంచలనమే నమోదు చేయనుంది అన్న మాట.