న్యూఢిల్లీ జూన్ 10
కాంగ్రెస్ పార్టీకి భారీ శస్త్ర చికిత్స అవసరమని ఆ పార్టీ సీనియర్ నేత ఎం వీరప్ప మొయిలీ అన్నారు. సామర్థ్యం, ప్రజాధారణ ఉన్న నేతలకు వివిధ రాష్ట్రాల బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద బీజేపీలో చేరిన నేపథ్యంలో గురువారం ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే జితిన్ బీజేపీలో చేరడంపై మొయిలీ పలు విమర్శలు చేశారు. జితిన్ మిగిలిన అన్నిటి కన్నా తన వ్యక్తిగత ఆకాంక్షలకే ప్రాదాన్యం ఇచ్చారని మండిపడ్డారు. జితిన్ సైద్ధాంతిక నిబద్ధత మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉండేదని, ఆయన ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక స్థానమైనా లభించలేదని, దీనిని బట్టి ఆయన అసమర్థుడని స్పష్టమవుతోందని విమర్శించారు. జితిన్‌కు పార్టీ చాలా బాధ్యతలు ఇచ్చిందని, అయితే యూపీలో కుల రాజకీయాలను ఆయన శాశ్వతం చేయాలనుకున్నారని మండిపడ్డారు.
తాజా పరిణామాల నేపథ్యంలో కేవలం వారసత్వం, గత చరిత్రపై ఆధారపడకూడదని, పార్టీ భావజాలానికి కట్టుబడి ఉన్నవారికి బాధ్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి వీరప్ప మొయిలీ సూచించారు. బాధ్యతలు అప్పగించేటపుడు సైద్ధాంతిక నిబద్ధతగల నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పార్టీలోని నేతల సమర్థతను సరైన రీతిలో అధిష్ఠానం మదింపు చేయాలన్నారు. కాంగ్రెస్ తన వ్యూహాలను పునరాలోచించుకోవాలని పిలుపునిచ్చారు. సమర్థులు కానివారికి పదవులు ఇవ్వవద్దని, పార్టీని సరైన విధంగా పునర్వ్యవస్థీకరించాలని కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆత్మావలోకనం చేసుకోవాలని, ఇది పార్టీకి ఓ గుణపాఠమని వ్యాఖ్యానించారు.