న్యూయార్క్, జూన్ 10,
అమెరికా వలసదారుల్లో చైనీయుల తర్వాతి స్థానం భారతీయులదే. సాఫ్ట్‌వేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఏ రంగం తీసుకున్నా భారతీయుల హవా సాగుతోంది. ప్రభుత్వ యంత్రాంగంలోనూ కీలక పదవుల్లో ఉన్నారు. అలాంటి భారతీయులపై అమెరికాలో వివక్ష క్రమంగా పెరుగుతోంది. అక్కడ ప్రతి ఇద్దరి భారతీయ అమెరికన్లలో ఒకరు జాతి వివక్ష లేదా మత వివక్షను ఎదుర్కొంటున్నట్టు ఓ సర్వే వెల్లడించింది. కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, జాన్స్ హాప్కిన్స్ ఎస్ఏఐఎస్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.గతేడాది సెప్టెంబర్ 1 నుంచి 20 మధ్య ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే (ఐఏఏఎస్) పేరుతో ఆన్‌లైన్ చేపట్టిన ఈ అధ్యయనంలో 1,200 మంది భారతీయుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఆ సర్వే ఫలితాలను ‘భారతీయ అమెరికన్ల సామాజిక స్థితిగతులు’ పేరిట బుధవారం ఓ నివేదికను విడుదల చేశారు. ఏడాది కాలంగా అమెరికాలోని సగం మంది భారతీయులు వివక్షను ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలింది. ఆశ్చర్యకరంగా అమెరికాలో పుట్టి పెరిగిన వారే ఎక్కువ వివక్షను ఎదుర్కొంటున్నారని గుర్తించారు.ఇక, ప్రతి పది మంది భారతీయుల్లో 8 మంది.. తోటి భారతీయులనే వివాహం చేసుకుంటున్నారని తేలింది. అమెరికాలో పుట్టిన భారతీయ అమెరికన్లు తమకు కాబోయే జీవితభాగస్వామి భారత మూలాలున్న వ్యక్తే కావాలని నాలుగు రెట్లు ఎక్కువగా కోరుకుంటున్నారు. సర్వేలో పాల్గొన్న మూడొంతుల మంది తమ జీవితాల్లో మతం చాలా కీలకమైందని స్పష్టం చేశారు. అలాగే, 40 శాతం మంది రోజుకు ఒక్కసారైనా దేవుడ్ని ప్రార్ధిస్తామని, 27 శాతం మంది వారానికి ఒకసారి మత కార్యక్రమాలకు హాజరవుతామని చెప్పారు.హిందువుల్లో సగం మంది పేరుకు కులాన్ని కచ్చితంగా తగిలించుకుంటున్నారని తేలింది. ప్రతి పది మందిలో ఎనిమిది కంటే ఎక్కువ సాధారణ లేదా ఉన్నత వర్గానికి చెందినవారమని స్వీయ గుర్తింపు పొందుతున్నారు. అక్కడ భారతీయులను ఇండియన్ అమెరికన్లని పిలవడం తమకిష్టం లేదని 60 శాతం మంది చెప్పడం విశేషం. కాగా, 2018 గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రస్తుతం 42 లక్షల మందికిపైగా భారతీయులు నివసిస్తున్నారు.సామాజిక సంబంధాలు భారతీయ సంతతికి చెందిన ఇతర వ్యక్తులతోనే ఎక్కువగా ముడిపడి ఉన్నాయి. భారతీయ-అమెరికన్లు ముఖ్యంగా మొదటి తరం ఇతర భారత మూలాల వారితోనే సంఘటితమవుతారు. అంతర్గతంగా భారతీయ-అమెరికన్ల సామాజిక సంబంధాలు కులం కంటే మతం పరంగా ఎక్కువ ఆధారపడి ఉండటం విశేషం. భారతీయ-అమెరికన్లలో ఈ వైఖరి అమెరికన్ సమాజంలో విస్తృత పోకడలను ప్రతిబింబిస్తుందని నివేదిక పేర్కొంది.