అనంతపురం, జూన్ 11,
జేసీ బ్రదర్స్ సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే ఉన్నప్పటికీ వారు తమ సొంత ఇమేజ్ నే నమ్ముకుని వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుంది. అందుకే ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా ఈ మూడేళ్లు తమ పని తాముచేసుకోవాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అధికార పార్టీతో అనవసరంగా వివాదాలు పెట్టుకుని కష్టాలుకొని తెచ్చుకోవద్దని జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు హితబోధ చేసినట్లు తెలిసింది.జేసీ కుటుంబానికి పార్టీ కంటే సొంతంగా పట్టుంది. ముఖ్యంగా తాడిపత్రి వంటి నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ కు ఇప్పటికీ చెక్కు చెదరని ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్ లో ఉన్నా, టీడీపీ లో ఉన్నా ఆ ఓటు బ్యాంకుకు ఎలాంటి నష్టం జరగకుండా వారు ఇప్పటి వరకూ కాపాడుకుంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ తాడిపత్రిలో టీడీపీ జెండా ఎగరగలిగిందంటే అది జేసీ బ్రదర్స్ సత్తా అని చెప్పక తప్పదు. ఈ గెలుపునకు, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు.ఇప్పుడు జేసీ బ్రదర్స్ ముందున్న లక్ష్యం 2024 అసెంబ్లీ ఎన్నికలు. తాడిపత్రిని తిరిగి కైవసం చేసుకోవలన్నది వారి గోల్. అందుకోసమే ఇప్పటి నుంచే పూర్తిగా జేసీ బ్రదర్స్ తాడిపత్రిపైనే దృష్టి కేంద్రీకరించారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాలకు వెళ్లకుండా పట్టణ అభివృద్ధిపై నే దృష్టి పెట్టారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనూ జేసీ బ్రదర్స్ పెద్దగా పాల్గొనడం లేదు. వాళ్లు కేవలం వ్యక్తిగత కార్యక్రమాలను పెట్టుకుని ఇటు క్యాడర్ ను ఉత్సాహ పరుస్తున్నారు.ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి అనేక కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు. మరికొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని జేసీ బ్రదర్స్ నిర్ణయించు కున్నట్లు తెలిసింది. మూడేళ్ల పాటు మౌనంగా ఉండటమే బెటర్ అని వారు నిర్ణయించుకున్నారు. తప్పుడు కేసులు పెడితే అప్పుడు చూసుకోవచ్చన్న ధోరణిలో ఉన్నారు. వారు పార్టీ మీద కూడా పెద్దగా ఆధారపడదలచుకోలేదు. బాబు సమావేశాలకు కూడా వారు దూరంగా ఉంటున్నారు. మొత్తం మీద జేసీ బ్రదర్స్ మరో మూడేళ్ల పాటు మౌనంగా ఉండటమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.