గుంటూరు, జూన్ 11,
అంబటి రాంబాబు సీనియర్ రాజకీయ నేత… ఆయన ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నా… ఆయన రాజకీయం అప్పుడెప్పుడో మూడున్నర దశాబ్దాల క్రిందటే స్టార్ట్ అయ్యింది. 1989లోనే గుంటూరు జిల్లా రేపల్లె నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ రేపల్లెలో ఆయన ఓడిపోయారు. రెండు వరుస ఓటముల తర్వాత ఆయనకు 2004 ఎన్నికల్లో సీటు రాలేదు. అయితే 1989 నుంచి కూడా అంబటి రాంబాబు వైఎస్ టీంలో గుంటూరు జిల్లా నుంచి కీలక నేతగా ఉండేవారు. అదే ఆయన రాజకీయ జీవితానికి ఎప్పుడూ శ్రీరామరక్షగా నిలిచింది. ఈ క్రమంలోనే 2004లో పార్టీ అధికారంలోకి వచ్చాక వైఎస్ అంబటి రాంబాబుకి కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అంబటి రాంబాబుకి ప్రజాబలంలో పట్టుందా ? లేదా ? అన్నది పక్కన పెడితే ఆయన బలమైన వాగ్దాటి ఆయనకు ఎప్పుడూ ప్లస్ అవుతోంది.వైఎస్ మరణాంతరం అంబటి రాంబాబుకి మళ్లీ వైఎస్ జగన్ రాజకీయంగా లైఫ్ ఇచ్చారనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో ఎంతో పోటీ ఉన్నా సత్తెనపల్లి సీటును ఆయనకే కేటాయించారు. ఆ ఎన్నికల్లో అంబటి రాంబాబు దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక గత ఎన్నికల్లో సత్తెనపల్లి సీటు అంబటి రాంబాబుకి వస్తుందా ? రాదా ? అన్న సందేహాలు చివరి వరకు ఉన్నా చివర్లో అంబటి మరోసారి పోటీ చేసి కోడెలపై ఘనవిజయంతో రివేంజ్ తీర్చుకున్నారు. అప్పుడెప్పుడో 1989 తర్వాత 30 సంవత్సరాలకు మళ్లీ జగన్ దయతో అంబటి రాంబాబు అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అయితే తన సీనియార్టీ నేపథ్యంలో ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ఆయన ఆశలు పెట్టుకున్నా అవి నెరవేరలేదు.త్వరలో కేబినెట్ ప్రక్షాళన ఉండడంతో అంబటి రాంబాబు మళ్లీ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్టే కనిపిస్తోంది. అంబటి ఎంత సీనియర్ అయినా.. పార్టీ కోసం ఎంత వాయిస్ వినిపిస్తున్నా ఇప్పటి వరకు అయితే పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కనపడడం లేదు. కేబినెట్లో ఇప్పటికే నలుగురు కాపు నేతలు మంత్రులుగా ఉన్నారు. నాలుగైదు నెలల్లో వీరిలో ఎవరు అవుట్ అవుతారు ? ఇదే వర్గం నుంచి ఎవరు ? కేబినెట్లోకి ఇన్ అవుతారు ? అంబటి రాంబాబుకి అటు కుల సమీకరణలతో పాటు.. ఇటు జిల్లా సమీకరణల్లో చోటు దక్కుతుందా ? అన్నది చూడాలి. అయితే అంబటి మాత్రం ఎమ్మెల్యేగా ఇదే తనకు చివరి ఛాన్స్ అని.. ఇక మంత్రి పదవి కూడా వస్తే గిస్తే ఇప్పుడే రావాలని పట్టుదలతో తన ప్రయత్నాలు చేస్తున్నారు. మరి జగన్ కరుణ అంబటి రాంబాబుపై ఎంత వరకు ఉంటుందో ? చూడాలి.