కర్నూల్, ఆనందయ్య మందు లాంటి మందే ముసునూరులో ఉచితంగా పంపిణీ ! కర్ణాటక , చెన్నై , తెలంగాణలనుండి కూడా తరలివస్తున్న జనం ! నామందు ఇమ్యూనిటీ పెంచుతుందంటున్న తయారీదారుడు.
నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో వున్న కృష్ణపట్నం లో ఆనందయ్య వెలసినట్లే - అదే జిల్లాలో కావలి నియోజకవర్గంలోని ముసునూరు లోనూ ఆనందయ్య లాంటి వైద్యుడు వెలిసాడు.ఇక్కడ పెరుగుతున్న జనం రద్దీని చూస్తుంటే - ముసునూరు గ్రామం కూడా త్వరలో మరో కృష్ణపట్నంగా మారబోతుందనిపిస్తుంది. సహజంగా ఏ ఫార్మా కంపెనీ అయినా కనిపెట్టిన మందుకు సంబంధించిన ఫార్ములా గోప్యంగా వుంచడం జరుగుతుంది.కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన కరోన నివారణ మందు ఫార్ములాను మాత్రం విచారణకు నియమించిన జిల్లా అధికారుల కమిటీ బట్టబయలు చేసింది.దాంతో ఆనందయ్య తన మందులో ఏమేమి వాడుతాడన్నది ప్రపంచానికి తెలిసిపోయింది.ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ ఆనందయ్య మందుకు ఆయుర్వేద మందు అన్న గుర్తింపును ఇవ్వకున్నా - ఆనందయ్య మందు ఎలాంటి దుష్ప్రభావాలు చూపదన్న సర్టిఫికెట్ మాత్రం ఇచ్చింది.ఆ ప్రకటన వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆనందయ్యలు తయారై ఈ మందు తయారుచేసేందుకు ఉపక్రమించారు.ఈ ఫార్ములా టైప్ మందునే తయారుచేయడానికి పూనుకున్నారు.కేంద్ర ప్రభుత్వం కరోన మహమ్మారి బారిన
పడకుండా ప్రజల్ని కాపాడే ప్రక్రియలో భాగమైన టీకాల పంపిణీ కార్యక్రమం బాగా జాప్యం అవుతుండడంతో - కోట్లాదిమంది ప్రజలు ఆనందయ్య లాంటి నాటువైద్యులు తయారుచేసే మందు వేసుకొని ఉపశమనం పొందేందుకు ఎగబడుతున్నారు.ఇదిలావుంటే ఆనందయ్య మందు ఇక ప్రత్యక్షంగా కృష్ణపట్నం లో దొరికే పరిస్థితి లేకుండా పోయింది. సామాన్యులకు ఆనందయ్య మందు ఇప్పుడు అందని ద్రాక్ష సామెత అయ్యింది. కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలులో వుంది. ఆనందయ్య కూడా అందుబాటులో లేకుండా పోయాడు.దేవుడి దర్శనం అయినా దొరుకుతుంది గానీ - ఆనందయ్య దర్శనం మాత్రం దొరికే పరిస్థితి లేదు.ఆయన చుట్టూ 10 మంది ఏఆర్ కానిస్టేబుళ్లను బందోబస్తుగా ప్రభుత్వం ఏర్పాటుచేసింది.కృష్ణపట్నంలో సీవీఆర్ అకాడమీ ( చింతా విశ్వేశ్వరరావు అకాడమీ )లోవున్న " కృష్ణపట్నం సెక్యూరిటీ సర్వీసెస్ ప్రెవేట్ లిమిటెడ్ అకాడమీ "లో ఇప్పుడు ఆనందయ్య మందు తయారవుతుంది.ఆ మందు తయారీ అంతా పూర్తిగా అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుంది.ఇటీవల చంద్రగిరి.సర్వేపల్లి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గాల పరిధిలో కొందరికి ఆనందయ్య తయారుచేసిన మందు పంపిణీ చేయడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం . ప్రస్తుతం ఆనందయ్య గాని, ఆనందయ్య మందుగాని సాధారణ ప్రజలకు అందుబాటులో లేదు.దీంతో ఇప్పుడు ప్రజలు ఆనందయ్య మందు లాంటి మందు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొని తమ ప్రాణాలు కాపాడుకొనేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు .
ముసునూరులో....
కావలి నియోజకవర్గ పరిధిలో వున్న ముసునూరు గ్రామంలోని ఒక తోటలో ఆనందయ్య మందు తరహాలోనే నాటు మందును జెట్టి భాస్కరరెడ్డి తయారుచేసి ప్రజలకు ఉచితంగా పంపిణీచేస్తున్నాడు . కొద్ది రోజుల క్రితమే అక్కడ ఈ మందు తయారీ ప్రారంభం అయినా - ఈ తయారీవిషయం ఆనోటా ఈనోటాపడి పొరుగు రాష్ట్రాలకు కూడా ఎగబాకడంతో జనం రద్దీ పెరిగిపోయింది . గురువారం ఉదయం స్వతంత్ర ప్రభ జెట్టి భాస్కరరెడ్డి మందు తయారుచేసే తోట ప్రాంగణానికి వెళ్ళింది . స్వతంత్ర ప్రభ ప్రతినిధితో తయారీదారుడు భాస్కరరెడ్డి మాట్లాడాడు.తాను తయారుచేసే మందు మనిషిలో ఇమ్యూనిటీని పెంచుతుందన్నారు . కరోన సోకిన వారు తన మందు వాడితే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని , తద్వారా కరోన వైరస్ అరికట్టబడుతుందన్నారు.ఆనందయ్య మందు తరహాలోనే వన మూలికలు,ఆకులు తయారీకి వాడే ముడి పదార్ధాలు అక్కడ గుట్టలు గుట్టలుగా కనిపించాయి.మందు తయారుచేసేది తానేనని భాస్కరరెడ్డి తెలిపాడు.ఎవరైనా దాతల ప్రోత్సాహంతో తయారుచేసున్నారా ? అని ప్రశ్నిస్తే ... అలాంటిదేమీ లేదన్నాడు.తన స్వంత డబ్బుతోనే మందు తయారుచేసి ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నానన్నాడు .జెట్టి శేషారెడ్డి కొద్ది రోజులు కృష్ణపట్నంలో వుండి అక్కడ ఆనందయ్య మందు తయారుచేసే విధానాన్ని తెలుసుకొని వచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ కరోన క్లిష్టసమయంలో ప్రాణాలకు ప్రమాదం లేని నాటు మందు తయారుచేస్తున్న ఆనందయ్య ,షమీ, జెట్టి శేషారెడ్డి లాంటి నాటు మందు తయారీదార్లను ప్రభుత్వం ప్రోత్సహించాలి.కార్పొరేట్ వైద్యశాలల్లో లక్షలు చెల్లించుకోలేక విలవిలలాడుతున్న జనంలో ఆనందయ్య మందు ఒక నమ్మకాన్ని ఆవిష్కరించింది . కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో అధికారులు కూడా సామాన్య ప్రజలకోసం - నాటుమందు తయారుచేసి ఉచితంగా పంపిణీ చేస్తున్న ఇలాంటి నాటు వైద్యులపై కొరడాలు ఝుళిపించకుండా తగు సహకారాలు అందించాలి.