న్యూఢిల్లీ జూన్ 11
ఉత్తరప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీని కలిశారు సీఎం యోగి ఆదిత్యనాథ్. యూపీలో యోగిపై, కరోనాను ఆయన ప్రభుత్వం నిర్వహించిన తీరుపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. గంటకుపైగా మోదీతో యోగి భేటీ అయ్యారు. బిజీ షెడ్యూల్‌లో మోదీ తనకు సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు చెబుతూ యోగి ట్వీట్ చేశారు. అందులో మోదీని కలిసిన సందర్భంలోని ఫొటోను పోస్ట్ చేశారు. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడానికి యోగి ఆయన ఇంటికి వెళ్లారు.గురువారం హోంమంత్రి అమిత్ షాతో యోగి గంటన్నర పాటు సమావేశమైన విషయం తెలిసిందే. ఎన్నికలకు మరో ఏడాది సమయం కూడా లేకపోవడంతో పార్టీలో ఏర్పడిన అంతర్గత విభేదాలను తగ్గించే పనిలో పార్టీ పెద్దలు ఉన్నారు. యోగిని మార్చే ఆలోచనలో పార్టీ లేకపోయినా.. కొన్ని కీలక మార్పులు తప్పకపోవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత వారం బీజేపీ నేత బీకే సంతోష్ యూపీలో పర్‌టించి అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల అభిప్రాయాలు సేకరించారు.