ముంబై జూన్ 11
మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ముంబై మహానగరం జలమయం అయ్యింది. ఇవాళ కూడా ముంబైలో వర్షం కురుస్తోంది. నగరంలోని కొలబా ప్రాంతంలో 23.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఇక సాంటాక్రజ్‌లో 107.4 మిల్లిమీటర్ల వర్షం నమోదు అయినట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. మాతుంగ ప్రాంతంలో ఉన్న కింగ్స్ సర్కిల్ వద్ద కూడా భారీ స్థాయిలో నీరు నిలిచిపోయింది. ఏకధాటిగా కురుస్తున్న వానలతో.. వీధుల్లో నీటిమట్టం పెరుగుతోంది. నగరంలోని మహిమ్ ప్రాంతంలో కూడా నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికులు చాలా ఇబ్బందిపడుతున్నారు. ఈస్ట్ అంథేరిలో కూడా భారీ స్థాయిలో వర్షం పడడంతో.. ఎక్కడికక్కడ వాననీరు స్తంభించింది. అంథేరీలోని సబ్‌వే పూర్తిగా నీటిలో మునిగిపోయింది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నగరంలో ఇవాళ కూడా తేలికపాటి వర్షం కురుస్తుందని ఐఎండీ చెప్పింది. నగర శివార్లలో భారీ నుంచి అతి భారీ వర్షం నమోదు అయ్యే అవకాశం ఉన్నది.