YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

తృణమూల్ లోకి ముకుల్ రాయ్....బీజేపీకి షాక్

తృణమూల్ లోకి ముకుల్ రాయ్....బీజేపీకి షాక్

కోల్ కత్తా, జూన్ 11, 
పశ్చిమ్ బెంగాల్‌లో కాషాయ జెండా ఎగురేయడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్య అనుచరులకు గాలంవేసి లాక్కున్నా ప్రయోజనం లేకపోయింది. బీజేపీ వ్యూహాలను ఒంటిచేత్తో తిప్పికొట్టి పార్టీని వరుసగా మూడోసారి అధికారంలోకి మమతా తీసుకొచ్చారు. ఎన్నికల ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరిన చాలా మంది నేతలు తిరిగి సొంతగూటికి చేరుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా, సీనియర్ నేత ముకుల్ రాయ్ దీదీ సమక్షంలో తిరిగి టీఎంసీలో చేరారు.2017 నవంబరులో బీజేపీలో చేరిన ముకుల్ రాయ్.. టీఎంసీ నుంచి ఆ పార్టీలోకి వెళ్లిన తొలి సీనియర్ నేత కావడం గమనార్హం. గత వారం రోజులుగా ముకుల్ రాయ్ చేరికపై మీడియాలో ముమ్మర ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం తన కుమారుడు శుభ్రాన్షు రాయ్‌తో కలిసి కోల్‌కతాలోని టీఎంసీ ప్రధాన కార్యాలయానికి ముకుల్ చేరుకున్నారు. దీదీతో సమావేశం అనంతరం ఇరువురూ టీఎంసీలో చేరుతున్నట్టు ప్రకటించారు.బీజేపీ రాజకీయ సంస్కృతి, సిద్ధాంతాలను బెంగాలీలు పరాయివిగా భావిస్తున్నారు.. భవిష్యత్తులో ‘బయటి వ్యక్తి’గా ఉండాల్సి వస్తుందని ముకుల్ రాయ్ తన సన్నిహితులతో అన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మమతా బెనర్జీ ప్రజానాడి తెలిసిన నేతని అభిప్రాయపడ్డారు. కొద్దికాలంగా బీజేపీలో ముకుల్‌ రాయ్ ఇమడలేకపోయారు. బెంగాల్‌లో టీఎంసీ ఘనవిజయం సాధించిన నెల రోజుల తర్వాత ముకుల్‌ రాయ్ తిరిగి రావడం విశేషం. ఆయన ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి కూడా.ముకుల్ రాయ్ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నపుడు మమత బెనర్జీ అండగా నిలవడంతో ఆయన మనసు మారినట్లు తెలుస్తోంది. ముకుల్ రాయ్, ఆయన సతీమణి ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇరువురూ కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వారి కుటుంబానికి మమత బెనర్జీ, అభిషేక్ బెనర్జీ అండగా ఉన్నట్లు శుభ్రాన్షు ఇటీవల మీడియాకు చెప్పారు.ముకుల్ రాయ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణానగర్ (ఉత్తర) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున విజయం సాధించారు. ఆయన గతంలో రాజ్యసభ సభ్యునిగా, రైల్వే మంత్రిగా పని చేశారు. ఎన్నికల తర్వాత బీజేపీతో అట్టీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల కిందట ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషణకు బీజేపీ నిర్వహించిన భేటీకి డుమ్మా కొట్టారు. బెంగాల్ బీజేపీ విభాగం ఏర్పాటుచేసిన ఈ అత్యున్నత సమావేశానికి రాయ్ సహా షామిక్ భట్టాచార్య, రాజీబ్ బెనర్జీలు గైర్హాజరయ్యారు.

Related Posts