సు+ఆస్తిక్ = స్వస్తిక్….అంటే మంచి కలుగుగాక.! అసలు ఈ స్వస్తిక్ చిహ్నం విశిష్టత, పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం.! స్వస్తిక్ గుర్తు వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం
శుభప్రదం స్వస్తిక్ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది. స్వస్తిక్ అంటే శుభం జరగటం. విశేష సమయాల్లో స్వస్తిక్ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం ఉంది. విఘ్నహర్త అయిన గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కనుకనూ, దీన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈ స్వస్తిక్ చిహ్నం సూర్యభగవానుని గతిని సూచిస్తుందనీ అంటారు. అందుచేత అది పురాతనకాలంలో సూర్యపూజలకు చిహ్నంగానూ వుండేదట. దీన్ని శ్రీమహాలక్ష్మీదేవికి ప్రతీకగానూ చెబుతారు. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు, ఈ చిహ్నాన్ని గీస్తారు. తమ వ్యాపారాలకు గణపతి కాపుగా వుండాలనిట. దీపావళికే కాకుండా, షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్ గీస్తారు. ఉత్తరాదివారి వివాహాలలో, వధూవరుల నుదుట ఈ చిహ్నం వుంటుంది. వారి దాంపత్యజీవితాలు సుఖమయంగా జరగాలనీ, జరుగుతాయనీ సూచన.
భారతీయులు స్వస్తిక్ ను ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు. దేశంలో అనేక మతాలకు చెందిన వారు దీన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తారు. సుమారుగా 12వేల ఏళ్ల కిందటి నుంచి స్వస్తిక్ మనుగడలో ఉందని చరిత్రకారులు చెబుతారు. కేవలం మన దేశంలోనే కాదు.. అనేక దేశాలకు చెందిన వారు స్వస్తిక్‌ను, దాన్ని పోలిన చిహ్నాలను అనేక వేల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం, జైనిజంలలో, టిబెట్, చైనా, జపాన్, గ్రీస్, అజ్టెక్, సెయ్లాన్, హోపి, సెల్ట్, బాలి, మాల్టా, ల్యాప్‌లాండ్ వంటి దేశాల్లో స్వస్తిక్ చిహ్నాన్ని ప్రజలు వాడుతున్నారు.
ఉక్రెయిన్‌లోని మెజిన్ అనే ప్రాంతంలో ఓ ఏనుగు దంతంపై చెక్కబడిన పక్షి బొమ్మలో స్వస్తిక్ చిహ్నాన్ని గుర్తించారు. అది సుమారుగా 13వేల ఏళ్ల కిందటిదని నిర్దారించారు. సంస్కృతంలో సు అంటే మంచి, శుభం అని అర్థాలు వస్తాయి. అలాగే అస్తి అంటే కలుగు గాక అని అర్థం వస్తుంది. రెండింటినీ కలిపితే సు + అస్తి = స్వస్తిగా మారుతుంది. అంటే మంచి ఆరోగ్యం లేదా శుభం కలుగుతుంది అని అర్థం అన్నమాట. అందుకనే ఈ చిహ్నం తమకు అన్ని విధాలుగా మంచి చేస్తుందని చెప్పి అనేక మంది దీన్ని వాడడం మొదలు పెట్టారు.
స్వస్తిక్ చిహ్నంలో ఉండే నాలుగు శాఖలు ప్రకృతి పునర్జన్మను సూచిస్తాయి. అంటే జీవుల పుట్టుక, మరణం ఒకదాని తరువాత ఒకటి నిరంతరాయంగా జరుగుతుందని అర్థం. స్వస్తిక్ చుట్టూ వృత్తాన్ని గీస్తే వచ్చే చిహ్నం సూర్యున్ని ప్రతిబింబిస్తుంది. అది కాంతికి జన్మస్థానంగా చెప్పబడుతుంది. అది విశ్వంలో నలువైపులకు వ్యాపిస్తుంది.
స్వస్తిక్‌కు ఉండే నాలుగు రేఖలు నాలుగు దిక్కులను కూడా సూచిస్తాయి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిక్కులను అవి సూచిస్తాయి. స్వస్తిక్ మధ్యలో ఉండే స్థానం హిందూ దైవం విష్ణువును సూచిస్తుంది. విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మ పుట్టాడు. అందువల్ల స్వస్తిక్ మధ్య స్థానం నుంచి విశ్వం ఆవిర్భవించి విస్తరించిందని చెబుతారు. స్వస్తిక్ మధ్య భాగాన్ని దైవానికి ప్రతీక అని భావిస్తారు.
స్వస్తిక్ చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా భావిస్తారు. మరొక రేఖను నాలుగు వేదాలని చెబుతారు. మరొక రేఖను నాలుగు పురుషార్థాలని భావిస్తారు. ఇంకో రేఖను పౌరులు పాటించాల్సిన ఆశ్రమ ధర్మాలని చెబుతారు. వేదాలు నాలుగు – రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. పురుషార్థాలు కూడా నాలుగు – ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఆశ్రమ ధర్మాలు కూడా నాలుగు – బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ధర్మాలు…
బౌద్ధులు స్వస్తిక్ చిహ్నాన్ని ప్రతిభా పాటవాలకు, నైపుణ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో స్వస్తిక్ చిహ్నాన్ని ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉపయోగిస్తారు. నొవాజో అనే ఓ తెగకు చెందిన వారు స్వస్తిక్ చిహ్నాన్ని అనారోగ్యాలను నయం చేసేందుకు నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమాల్లో వాడుతారు.
అయితే జర్మన్ నియంత హిట్లర్ కూడా స్వస్తిక్ చిహ్నాన్ని తన నాజీ సైన్యంలో ఉపయోగించాడు. అందువల్ల స్వస్తిక్‌ను చెడు అనుకునే వారు కూడా చాలా మందే ఉన్నారు. మన దేశంలో ఆర్యులు జర్మనీ దేశానికి చెందిన పూర్వీకులు అని హిట్లర్ నమ్మేవాడు. అందుకనే మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే స్వస్తిక్ చిహ్నాన్ని హిట్లర్ తన నాజీ సైన్యం చిహ్నంగా ఉపయోగించాడని చెబుతారు. ఇక స్వస్తిక్ చిహ్నాన్ని అనేక రకాలుగా ప్రస్తుతం అనేక మంది వాడుతున్నారు. వాటిల్లో రెండు రకాలు ప్రధానంగా ఉన్నాయి.
స్వస్తిక్, ఓం, త్రిశూలం అనే మూడింటిని ఇంటి ప్రధాన ద్వారంపై అంటించి పెడితే ఇంట్లోని దుష్టశక్తులు పారిపోతాయి. అయితే స్వస్తిక్ గుర్తులు, పటాలు పాదాలు తాకేలా వుండకూడదు. స్వస్తిక్‌ను డోర్‌కు అతికించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. ఈతిబాధలుండవు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా స్వస్తిక్ రంగ వల్లికలు పూజా గదిలో అలంకరించుకుని పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.