త్రిమూర్తులలో లయకారుడైన శివుడికి కుమారుడిగా జన్మించి స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు నియమించిన కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని బాల్యంలోని బందించినట్లు పురాణాలు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి పసివాడుగా తల్లి పార్వతీదేవి ఒడిలో ఉన్న సమయంలో ఒకసారి శివుడు పార్వతీదేవికి ప్రణవ మంత్రార్థాన్ని వివరించారు. బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి దానిని విన ఆకళింపు చేసుకున్నాడు. ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి రాగా బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రణవమంత్రార్థాన్ని చెప్పాల్సిందిగా అడిగాడు. బ్రహ్మ సరిగ్గా చెప్పకపోవడంతో సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మదేవుడుని బంధించాడు. శివుడు జోక్యం చేసుకుని విడిపించాడు.
నెమలి వాహనం,కోడి ధ్వజం...
తారకాసురుడి సోదరుడైన శూరపద్ముడు దేవతలను ఇబ్బందిపాలు చేస్తూ ఉండడంతో సుబ్రహ్మణ్యస్వామి శూరపద్ముడుపై దండెత్తి యుద్ధం చేశాడు. యుద్ధంలో ఆరవరోజు శూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడు. సుబ్రహ్మణ్యస్వామి శూలాయుధం ప్రయోగించడంతో పక్షి రెండుగా ఖండింపబడింది. ఆ రెండిటిలో ఒకటి నెమలిగా, మరొకటి కోడిపుంజుగా మారి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని శరణు వేడుకోవడంతో....నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకుంటున్నట్లు పురాణ కథనం.
ఓం నమో నారాయణాయ