గుంటూరు, జూన్ 12,
సంపూర్ణ అధికారం అనుభవించడం ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా ఆసాధ్యమే. ఇక్కడ ఒకరిని మించి మరొకరు ఉంటారు. ఏపీకి సీఎం అయినా ఢిల్లీ రాజకీయాలను ఒడిసిపట్టకపోతే చిక్కులూ చికాకులూ ఎదురవుతూనే ఉంటాయి. ఎన్టీయార్ నాడు ఇందిరాగాంధీని ఓడించాను అనుకున్నారు. ఉమ్మడి ఏపీలో సీఎం అయ్యారు, ఆ మీదటనే అసలైన కష్టాలు ఆయనకు మొదలయ్యాయి. ఏ పని కావాలన్నా ఢిల్లీ పెట్టే అడ్డంకులు, ఆటంకాలతో విసిగిన ఎన్టీయార్ భారతదేశం పార్టీ అనేశారు. ఆయన ఆ పార్టీ పెట్టలేదు కానీ నేషనల్ ఫ్రంట్ రూపేణా అందరికీ ఒక చోటకు చేర్చి దేశంలో కాంగ్రేసేతర కూటమి అధికారంలోకి రావడానికి కారణం అయ్యారు. చంద్రబాబు తీరు చూస్తే ఆయన ఢిల్లీ రాజకీయాలను బాగా ఔపోసన పట్టేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దేవేగౌడ, గుజ్రాల్లని ప్రధానులను చేశారు. బీజేపీ వాజ్ పేయికి మద్దతు ఇచ్చి ఏపీలో తన పాలన చల్లగా సాగేలా చూసుకున్నారు. ఇక 2014 నుంచి 2018 దాకా మోడీ సర్కార్ తో కూడా సావాసం చేసి బాగానే నెట్టుకువచ్చారు. జగన్ రెండేళ్ల జమానాలో మాత్రం ఢిల్లీ పాలకులను అసలు కదిలించలేకపోతున్నారు. ఆయన తన ఎంపీలతో మోడీకి పూర్తి మద్దతు ఇస్తున్నా వారు జగన్ ని లైట్ గానే తీసుకుంటున్నారు. దాంతో జగన్ కి ఢిల్లీ సహకారం ఏ రకంగానూ దక్కడంలేదు అన్న మాట ఉంది. ఇక ఎన్టీయార్ మీద ఏ రకమైన కేసులు లేవు. చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్ చేయడంతో దిట్ట. కాబట్టి వారిద్దరూ నయానో భయానో ఢిల్లీ పాలకులను దారికి తెచ్చుకున్నారు. జగన్ పరిస్థితి అలా కాదు, ఆయన ఎంపీగా ఉండగానే ఢిల్లీ మీద పోరాటం చేసి సీబీఐ కేసులు తెచ్చుకున్నారు. అవి కాళ్ళకు పాశాలుగా మారి ఆయన్ని ముందుకు కదలనీయడంలేదు. దాంతో జగన్ గట్టిగా మాట్లాడలేరు, అలాగని మెత్తగానూ ఉండలేకపోతున్నారు. ఒక విధంగా జగన్ కి ఉన్న 28 మంది ఎంపీల మద్దతును ఆయాచితవరంగానే మోడీ సర్కార్ భావిస్తోంది తప్ప ప్రత్యుపకారం చేసేందుకు రాజకీయ బేరాలకు ఎక్కడా తావు ఇవ్వడంలేదు. చంద్రబాబు తన అయిదేళ్ల ఏలుబడిలో 29 సార్లు ఢిల్లీ వెళ్ళాలని చెప్పుకున్నారు. జగన్ రెండేళ్ళ వ్యవధిలోనే 11 సార్లు ఢిల్లీ గడప తొక్కారు. మరో మూడేళ్ళలో జగన్ బాబు రికార్డుని కూడా బద్దలు కొట్టేలా ఉన్నారు. ఇక చంద్రబాబు ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజి అన్న దాకానైనా కధను తెచ్చారు. జగన్ అది కూడా చేయడంలేదు అన్న మాట ఉంది. మరో వైపు జగన్ని మిత్రుడిగానూ, శత్రువుగానూ కూడా బీజేపీ పెద్దలు చూడకపోవడమే రాజకీయ విషాదంగా భావించాలేమో. ఆయన ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి విన్నపాలు ఇచ్చినా కూడా వాటి మీద కనీస స్పందన ఉండడంలేదు. అంతెందుకు తనను ధిక్కరించి ఏడాదిగా చెవిలో జోరీగ మాదిరిగా సౌండ్ చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామరాజు మీద అనర్హత వేటు వేయమని జగన్ ఎంత కోరుతున్నా బీజేపీ పెద్దలు అసలు ఖాతరు చేయడంలేదంటే ఎంత లైట్ గా తీసుకుంటున్నారో అర్ధమవుతోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా జగన్ ప్రస్తుతం ఉన్న స్థితి బీజేపీ హై కమాండ్ కి పూర్తిగా తెలుసు కాబట్టే ఇలా చేస్తోంది అన్నదే చర్చగా ఉంది. జగన్ ఏపీని గెలిచాడు కానీ ఢిల్లీని గెలిస్తేనే నిజమైన సక్సెస్ దక్కినట్లు అన్న మాట అయితే ఉంది.