కర్నూలు, జూన్ 12,
పాలకుల మీద జనాలకు మోజు ఉండాలి అంటే వారి అందమైన ముఖారవిందాన్ని చూస్తే జరిగేది కాదు. తీయతీయని హామీలను విన్నా కూడా కుదరదు. తాము ఎక్కడ ఉన్నా జనాలకు అవసరమైనవి చేసి పెడుతూ ఉంటే ఆ పాలకుడిని జనం గుండేలోనే ఉంచుకుంటారు. భారతీయ సగటు జనం గుండె చాలా విశాలం. ఇక వారు అల్ప సంతోషులు. ఏ కాస్తా ఉపకారం చేసినా ఆ నేతను జన నేతగా చేసేస్తారు. ఎప్పటికే ఆయనే తమ ఏలిక అని కూడా ఒట్టేసుకుంటారు.నాడు వైఎస్సార్ పాదయాత్ర చేసిన ఫలితంగా రైతులకు చాలా ఈతిబాధలు తీరాయి. అదే సమయంలో దేశంలోని చాలా పార్టీలకు కూడా రైతు గుర్తుకు వచ్చారన్నా అతిశయోక్తి కాదు. ఇక తండ్రి బాటలో నడచిన జగన్ కి రైతులు ఎపుడూ వెన్నంటే ఉన్నారు. జగన్ రెండేళ్ళ ఏలుబడిలో రైతులకు భరోసాతో పాటు చాలా కార్యక్రమాలే అమలు చేస్తున్నారు. అందులో ఉచిత బోరు పధకం ఒకటి. ఇది జగన్ ఇలాకా అయిన రాయలసీమలో సూపర్ హిట్ అయింది. బీడు భూముల్లో జల సిరులు కురిపిస్తూ జగన్ కి జేజేలు అనేలా చేస్తోంది ఈ పధకం.వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక రైతులకు ఉచిత విద్యుత్ పధకాన్ని అమలు చేశారు. అది దేశంలోనే అతి పెద్ద చర్చగా మారింది ఆనాడు. ఇపుడు జగన్ ఉచిత బోరు పధకం కూడా అంతే పేరు తెస్తోంది. సీమలో భూములకు నీరు కరవు. పైగా అన్నీ వర్షాధారమైనవే. అక్కడ రైతు చూపు ఎపుడూ ఆకాశం వైపే చూస్తూంటుంది. మరో వైపు చూస్తే భూగర్భ జలాలు తక్కువ. దాంతో బోర్లు వేసుకున్న నీరు వస్తుంది అన్న నమ్మకం అయితే లేదు. దీంతో నిరాశ నిండిన రైతులకు జగనన్న ఉచిత బోరు పధకం కల్పతరువుగా మారిందని అంటున్నారు. పది చోట్ల బోర్లు వేస్తే ఎనిమిది చోట్ల నీరు పడుతూ ఈ పధకం సక్సెస్ అవుతోంది అంటున్నారు.భూమిని నమ్మిన రైతులు నీరుని చూస్తే పిచ్చి. అలాంటి జలధారలను బోర్లు వేయడం ద్వారా జగన్ కురిపిస్తున్నారు. ఒక్కో బోరు వేయడానికి రెండు లక్షల దాకా ఖర్చు అవుతోంది. దానితో పాటుగా ఉచితంగా మోటారు పంపులను కూడా రైతులకు జగన్ సర్కార్ ఇస్తోంది. దీంతో ఫుల్ ఖుషీగా అక్కడ రైతాంగం ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది సీమలో విసృతంగా వానలు కురిసి భూగర్భ జలాలు కూడా పెరిగాయి. ఇలా అన్నీ కలసి రావడంతో ఈ పధకం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఎన్నో పధకాలు అమలు చేశారు. వాటిని అందుకున్న వారిలో ఏ కొంతమంది అయినా ఓటు వేయకపోవచ్చు. గుర్తు కూడా పెట్టుకోకపోవచ్చు. కానీ అన్నం పెట్టే రైతన్న తనకు ఉపకారం చేసిన వారిని ఎప్పటికీ మరచిపోడు. వీరే జగన్ కి అతి పెద్ద బలం. మరి సీమలో ఇప్పటికే తిరుగులేని వైసీపీకి జగన్ కి ఇది మరింత అండ. అందుకే జగన్ ఎప్పటికీ బోరు కొట్టరు అంటున్నారు సీమ జనం