న్యూఢిల్లీ, జూన్ 12,
దేశంలో మూడో వేవ్ కరోనా వైరస్ విజృంభించబోతుందని.. ఈ వేవ్ ప్రభావం ఎక్కువగా పిల్లలపై ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. 18ఏళ్ల లోపున్న పిల్లలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపింది. పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే.. వారికి యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ వాడొద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సూచించింది. ఐదు లేదా అంతకన్న తక్కువ వయుసున్న చిన్నారులకు మాస్క్ అవసరం లేదని ఆరోగ్యశాఖ తెలిపింది. ఆరు నుంచి 11ఏళ్ల పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాస్కు పెట్టుకోవచ్చిని సూచించింది.జాతీయ కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా ఉన్న భారత అగ్రశ్రేణి వైద్యులు మాత్రం పిల్లలకు థర్డ్ వేవ్ ముప్పును సూచించే ఎటువంటి సమాచారం లేదని అంటున్నారు. అయినా కూడా కేంద్రం మాత్రం పిల్లల కోసం కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. రెండో వేవ్‌లో కరోనా సోకిన మరియు ఆస్పత్రిలో చేరిన 60 నుంచి 70 శాతం మంది పిల్లలు తక్కువ రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని అన్నారు. అయితే ఆరోగ్యవంతమైన పిల్లలు మాత్రం ఆస్పత్రిలో అడ్మిట్ కాకుండానే కోలుకున్నారని ఆయన తెలిపారు.
తేలికపాటి లక్షణాలు
కరోనా లక్షణాలు లేని మరియు తేలికపాటి లక్షణాలు కలిగిన పిల్లలకు స్టెరాయిడ్లు వాడటం హానికరం. వీరికి ఇమ్యూనిటీ కోసం యాంటీమైక్రోబయల్స్ సిఫారసు చేయబడవు.అవసరాన్ని బట్టి హెచ్‌ఆర్‌సిటి ఇమేజింగ్ సిఫారసు చేయాలి.తేలికపాటి లక్షణాలు ఉంటే జ్వరం మరియు గొంతు ఉపశమనం కోసం పారాసెటమాల్ 10/15 mg / kg ప్రతి 4 నుంచి 6 గంటలకు ఒకసారి ఇవ్వొచ్చు. కౌమారదశలోని పిల్లలకు దగ్గు నుంచి ఉపశమనం కోసం సెలైన్ గార్గల్స్ ఇవ్వొచ్చు.
మధ్యస్థ లక్షణాలు
మధ్యస్థ లక్షణాలు కలిగిన పిల్లలకు వెంటనే ఆక్సిజన్ అందించాలని సూచించింది.ఈ స్టేజ్‌లో ఉన్న పిల్లలకు కార్టికోస్టెరాయిడ్స్ అవసరం ఉండదు.
తీవ్రమైన లక్షణాలు
పిల్లలలో తీవ్రమైన లక్షణాలుండి.. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అభివృద్ధి చెందితే మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన చికిత్సను ప్రారంభించాలి.లక్షణాలు ఒక్కసారిగా అభివృద్ధి చెందితే అవసరమైన చికిత్సను అందిస్తూ.. యాంటీమైక్రోబయల్స్ ఇవ్వాలి. అంతేకాకుండా ఇటువంటి పిల్లలకు ఆర్గాన్లు పనిచేయకుండా పోతాయి. అటువంటి సమయంలో అవసరమైతే ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి.12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆరు నిమిషాలపాటు వాకింగ్ అవసరం. ఇది కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలో చేయాలి. అంతేకాకుండా ఇటువంటి పిల్లల వేలికి పల్స్ ఆక్సిమీటర్ పెట్టి ఉంచాలి. పిల్లలను వారుంటున్న గదిలో అటూఇటూ ఆరు నిమిషాలపాటు ఆగకుండా నడవమని చెప్పాలి.