YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటల కమలంలో ఇమడగలరా

ఈటల కమలంలో ఇమడగలరా

హైదరాబాద్, జూన్ 12, 
ఈటల రాజేందర్ .. 19 ఏళ్ల తన అనుబంధానికి గుడ్ బై చెప్పేశారు. టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. అంటే తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమైనట్లే. హుజూరా బాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా కాబోతుంది. అయితే ఈటల రాజేందర్ బీజేపీలో చేరి ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కన్పిస్తుంది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరినందువల్ల నష్టపోయేది ఎవరంటే వ్యక్తిగతంగా ఆయనేనన్నది అనేక మంది అభిప్రాయం.ఆత్మగౌరవం కోసమే తాను పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఈటల రాజేందర్ ప్రకటించారు. అయితే ఆస్తులను కాపాడుకోవడం కోసమే బీజేపీ పంచన చేరారన్నది అధికార పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్. అధికార పార్టీలో ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడిన ఈటల రాజేందర్ మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ కాగానే విలువలు గురించి ఈటల రాజేందర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.అయితే బీజేపీలో చేరితే ఈటల రాజేందర్ ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఎలా ఉండనుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఈటల రాజేందర్ మనస్తత్వానికి, బీజేపీ సిద్ధాంతాలకు అసలు పొసగదు. ఆర్ఎస్‍‍‍‍యూ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని ఒంటబట్టించుకోవడం అంత సులువు కాదు. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అధికార పార్టీ నుంచి అక్రమ కేసులను ఎదుర్కొనాలంటే బీజేపీకి మించిన షెల్టర్ లేదని ఈటల రాజేందర్ భావించారు.హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరిగితే అది పూర్తిగా దుబ్బాక తరహా ఎన్నిక కావాల్సిందే. అక్కడ బీజేపీకి ఎటువంటి బలం లేదు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు అక్కడ బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్ తోనే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. అయితే గతంలో నాగం జనార్ధన్ రెడ్డి లాంటి నేతలు బీజేపీలో ఇమడలేక బయటకు వెళ్లిపోయారు. అలాంటిది ఈటల రాజేందర్ మనస్తత్వానికి బీజేపీలో ఇమడగలరా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

Related Posts