హైద్రాబాద్, జూన్ 12,
రాష్ట్రంలో ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు ప్రయివేటుపరం అవుతున్నాయి. దీంతో ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు ఎవరికి దక్కు తాయన్నది చర్చనీయాంశంగా మారింది. సమాజానికి సేవ చేస్తున్నాయన్న మానవతా కోణంలో పలు సొసైటీలకు ప్రభుత్వాలు భూములను లీజుకిచ్చాయి. ఇక ఆ కాలేజీల్లో భవనాల నిర్మాణం, ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్, ల్యాబ్‌లు, తరగతి గదులు, గ్రంథాలయాలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి అయ్యాయి. ఎయిడెడ్ కాలేజీల ప్రయివేటీకరణతో లీజుకిచ్చిన భూములు, భవనాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎవరికి చెందుతాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉన్నది. రాష్ట్రంలో 65 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిలో 54 డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రముఖంగా ఉన్న బద్రుకా కాలేజీ, ఎవి కాలేజీ, ఎస్పీ కాలేజీ, కస్తూర్బాగాంధీ కాలేజీ, వనితా మహావిద్యాలయ, భవాన్స్ న్యూసైన్స్ కాలేజీ, ప్రగతి మహావిద్యాలయ ఉన్నాయి. ఈ కాలేజీల్లోని కొన్ని ఎయిడెడ్ కోర్సులు సెల్ఫ్‌ఫైనాన్స్‌గా మారాయి. అంటే ఆ కాలేజీలు పూర్తిగా ప్రయివేటుపరం అయ్యాయని అర్థం. ఈ విషయంలో కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. అడ్డగోలుగా ఎయిడెడ్ కోర్సులను అన్‌ఎయిడెడ్‌గా మారుస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎయిడెడ్ కాలేజీ యాజమాన్యాల నుంచి కాలేజీయేట్ కమిషనర్‌కు రూ.లక్షల్లో ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులు సరిపోను మంది చేరడం లేదనే కారణంతో సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులుగా మారుస్తున్నామని చెప్తున్నారు. కానీ సెల్ఫ్‌ఫైనాన్స్‌గా మార్చిన చాలా కాలేజీల్లో విద్యార్థులు చేరుతుండడం గమనార్హం. విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపుతున్నా, నవీన్ మిట్టల్ మాత్రం విద్యార్థుల్లేరనే కారణంతో సైల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులుగా ఎందుకు మారుస్తున్నారనే విషయమై అనుమానాలున్నాయి. ఇక ఎయిడెడ్ కాలేజీలు ప్రయివేటుపరం కావడంతో ఆ భూములు, ఆస్తులను యాజమాన్యాలు సొంతం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. దీంతో వేల కోట్ల రూపాయవల విలువ చేసే ఆస్తులను అమ్ముకునేందుకు యాజమాన్యాలు పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. న్యాయపరంగా చిక్కులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది.పేద విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందించాలన్నది ఎయిడెడ్ డిగ్రీ విద్యాసంస్థల లక్ష్యం. సేవా దృక్పథంతో పలు సొసైటీలు ఆ మేరకు విద్యాసంస్థలను నెలకొల్పాయి. అందుకే ఆ కాలేజీల్లో సిబ్బందినీ ప్రభుత్వమే నియమించేది. కానీ 2006, మార్చి 27న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియామకాలపై నిషేధం విధిస్తూ జీవో నెంబర్ 35ను విడుదల చేసింది. దీంతో అప్పటి నుంచి ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. ఇక అప్పటి నుంచి ఎయిడెడ్ కోర్సులు క్రమంగా అన్‌ఎయిడెడ్‌గా మారుతున్నాయి. పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. యాజమాన్యాలు సొంతంగా అధ్యాపకులను నియమించుకుంటున్నాయి. ఎయిడెడ్ కోర్సులకు వచ్చే ఫీజుతో ప్రయివేటుగా పనిచేసే అధ్యాపకులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. దీంతో కొన్ని యాజమాన్యాలు ఎయిడెడ్ కోర్సులను సెల్ఫ్‌ఫైనాన్స్‌గా మార్చాలని ప్రభుత్వాన్ని కోరాయి. నవీన్‌మిట్టల్ గత విద్యాసంవత్సరం 18 కాలేజీల్లో ఎయిడెడ్ కోర్సులను సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులుగా మారుస్తూ ఆదేశాలిచ్చారు. 2019-20 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో ఉన్న కోర్సుల్లో రెండు లేదా మూడు కోర్సులను సెల్ఫ్‌ఫైనాన్స్‌గా మారుస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ విద్యాసంస్థల భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్ధకంగా మారింది.ఎయిడెడ్ కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. 2006, మార్చి 27న నియామకాలపై నిషేధం విధించిన తర్వాత యాజమాన్యాలు ప్రయివేటుగా సిబ్బందిని నియమించుకుంటూ వస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భవించడంతో జీవో నెంబర్ 35ను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎత్తివేస్తుందని, అందులో పనిచేస్తున్న వారి సర్వీసులను క్రమబద్ధీకరిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఆ దిశగా కదలిక లేదు. ఇంకోవైపు ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. వాటిలో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వారి దారెటు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిలో ఒక్కొక్కరికీ ఎన్నో ఏండ్ల అనుభవమున్నది. 13 ఏండ్ల నుంచి పనిచేస్తున్న వారూ లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ఎయిడెడ్ ఉద్యోగులు ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. న్యాయం కోసం అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టు సమాచారం.