YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

"శ్రీ వేంకటేశ్వరుడి పాద వైభవం "

"శ్రీ వేంకటేశ్వరుడి పాద వైభవం "

ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు.
శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో స్వామివారి మూలవిరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి. శుక్రవారం అభిషేక సేవకు ముందు, బంగారు పాదకవచాలను పక్కకు తీసి- స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు. అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరిట- భక్తులను టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు.
ఆనందనిలయంలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకో విషయం తెలుస్తుంది. అదేమిటో తెలుసా? ఆయన కుడిచేయి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని అర్ధం చేసుకోవాలి. శ్రీవారి పాదాలకు అంత విలువ. అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు. శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్ధమట.
శ్రీహరిని అవమానించినవీ పాదములే
సిరి అలిగినదీ ఆ పాదముల వల్లే
భృగువు అహంకారమును తొలగించినదీ పాదములే
లోకకళ్యాణము చేసినదీ ఆ పాదములే
సిరి- హరి విడిపోయినదీ ఆ పాదముల వల్లే
ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరినగుర్తులూ పాదములే. మూడడుగుల్లో ఆనంద నిలయం చేరినదీ పాదములే.. శ్రీహరి అందునా శ్రీవేంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం. ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు. ఆయన "ఇల" వైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు పాదాలే.
ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువుందో శ్రీరామావతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది. శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది. అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినాదంటా అని పాడాడు. అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు. శ్రీకృష్ణావతారం అంతమైందే పాదముల వల్ల. బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేసాడని చెబుతుంది భాగవతం. ఇక వామనావతారంలోనూ బలితన తలను అప్పగించడానికి కారణం పాదమే. శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత వుంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవిల్లాడుతాయి.
ఆగమశాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదంటారు. శ్రీవారి విషయంలో ఇంత ప్రాముఖ్యత వున్న పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు? అన్నది అటుంచితే శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు. బ్రహ్మకడిగిన పాదములవి. బ్రహ్మము తానెడి పాదములవే. శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదముల్లోనే దాగి వుంటాయి.
శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తట ఈ పాదములు. ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతీ దేవి ప్రేమలో పడ్డం, తర్వాత ఆమెతో పెళ్లి కావడం.. చకచకా జరిగాయి. తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిసాడు.
అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి?
అలిపిరి ప్రదేశంలో తలయేరుగుండు దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీపాదములు. కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంబి. అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పిందిక్కడే. కొండ నుంచి నంబి, గోవిందరాజ పట్టణం నుంచి శ్రీమద్రామానుజులు.. ఈ ప్రదేశం చేరుకొని భగవారాధన చేసేవారట. దీని వల్ల స్వామి వారి దర్శనం ప్రొద్దున్న & సాయంత్రం మాత్రమే అవుతోందని బాధ పడేవారు. వేంకటేశ్వర స్వామి వారు ఆయన కలలో కనబడి ఏమని అభయం ఇచ్చారంటే - నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్సనం చేసుకోవచ్చు అని. మనం కొండని కాలి మార్గం గుండా వెళ్ళే ముందు అలిపిరిలో శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే వచ్చాయి. ఎంతో గొప్ప మహానుభావుడాయన.
కాలి నడక మార్గంలో వెళ్ళేవారికీ అలిపిరి ప్రదేశంలో కనిపిచే మండపం ,పడాల మండపం .దీనినే పాదాల మండపం అని కూడా అంటారు .క్రీ.శ .1628 కాలం నాటిది ఈ పాదాల మండపం .ఈ మండపంలో `పాదరక్షలు `లెక్కలేనన్ని ఉన్నాయి . మాధవదాసు `అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక లేక ఇక్కడే శిలగా మరిపోయాడట .తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యం .ఆ రోజు ఉపవాసం చేయడం ,పిండితాళిగలు వేయడం సంప్రదాయం. ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలోని హరిజనులు ఇంటిలో ,కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి .ఆ పాద ముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు .శ్రీకాళహస్తి నుండి ఒకరు ,కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులున్ని నెత్తి పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాద రక్షలను ఆ పూజ మందిరంలో పెడతారు .
ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయట. కారణమేంటో తెలుసా.. తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట. అలమేలు మంగమ్మ దగ్గరకి వెళ్లి తిరిగి కొండ ఎక్కే వేళ. వాటిని ఇక్కడే వదిలి వెళతారని పురాణ ఇతిహాసం.
నారాయణ పాదములు
తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ. దూరంలో `నారాయణ పాదం` ఉంది. శ్రీవారి శ్రీపాద ముద్రలున్న శిలఫలకం ఇక్కడే కనిపిస్తుంది. నారాయణగిరి పాదముల విషయంలో ఆగమ శాస్త్ర ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు. కానీ, పాద పూజ- ఛత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పుడు పునఃప్రతిష్ట చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవనిర్వహణ జరిగేది. వీటినే "నారాయణ పాదములు" అంటారు.
ఆషాడ శుద్ద ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిది ఇక్కడే శ్రీపాద పూజ,ఛత్రస్టాపన ఉత్సవాలు జరుగుతాయి. శ్రీవారికి ప్రాతఃకాల మధ్యాహ్నకాల ఆరాధనం ముగిశాక అర్చకులు,ఏకాంగులు, అధికారులు,పరిచారకులు రెండు `భూచక్ర ` గొడుగులను, యమునోత్తరం నుండి పుష్పసరాలను,బంగారు బావి తిర్ద్దాన్ని సంసిద్ధం చేసుకొని మంగళ వాద్యాలతో బయలుదేరుతారు. మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు. ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీ పాదలకు బంగారు బావి జలంతో అభిషేకం చేస్తారు. హారతి ఆరగింపులు విర్వహిస్తారు. శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు `భూచక్ర గొడుగులను` కట్టి వెనుకకు తిరుగుతారు. నారాయణగిరి దిగి బంగళాతోటకు వచ్చి చేరుతారు.ఆఫై ప్రసాద వినియోగం,వనభోజనం జరుగుతాయి. తదనంతరం మహాద్వారం చేరుకొంటారు.
అలా శ్రీవారి పాదములను ఇన్ని రకాలుగా పూజించడం గౌరవించడం జరుగుతుంది.అసలు శ్రీవారిని ఆమూలాగ్రం దర్శించుకుంటే జన్మధన్యమైనట్టే. ఇక శ్రీనివాసుని పాదం దర్శించుకుంటే- ఆయన హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్టే భావిస్తారు.
సేకరణ: పద్మావతి చల్లా
 

Related Posts