ఆరు ముఖములను, పన్నెండు చేతులను కలిగి నెమలి వాహనారూఢుడై దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉన్న శివపార్వతుల గారాల బిడ్డ దేవ సేనల ప్రభువు కేవలం కావడి మొక్కులను సమర్పించినంతనే భక్తులకు వంశాభివృద్ధిని, బుద్ధి సమృద్ధిని ప్రసాదించే భక్తసులభుడైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు జన్మించిన పవిత్ర పర్వదినం 'శ్రీ సుబ్రహ్మణ్య షష్టి'. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. ఈ పర్వదినానికి సుబ్బరాయషష్టి, కుమారషష్టి, స్కందషష్టి, కార్తికేయషష్టి, గుహప్రియా వ్రతం వంటి పేర్లున్నాయి.
శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పుట్టుక...
శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన గాథలు పురాణాల్లో కనిపిస్తాయి. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బలగర్వితుడై సకల లోకవాసులను హింసిస్తూ ఉండడంతో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అందుకు ''శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. శివుడు తపస్సు మానేసి పార్వతీదేవిని పరిణయమాడునట్టు చేస్తే వారికి జన్మించే కుమారుడు తారకాసురుడిని అంతమొందిస్తాడు'' అని ఉపాయం చెప్పాడు. ఈ మాటలను విన్న దేవతలు, శివుడు తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకునేలాగా చేసేందుకు మన్మథుడిని పంపగా శివుడు తన మూడవ నేత్రం తెరిచి మన్మథుడిని దహించి వేశాడు. అయితే తారకాసురుడిని అంత మొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ శృంగారంలో తేలియాడుతూ ఉన్న సమయంలో శివుడి రేతస్సు పతనమై భూమిపై పడింది. దానిని భూమి భరించలేక అగ్నిలో పడవేసింది.
అగ్నిదానిని భరించలేక గంగలో వదలగా దానిని గంగ తన తీరంలోని శరవణమునకు తోసివేసింది. అక్కడే శ్రీకుమారస్వామి జన్మించాడు. శరవణమున జన్మించిన వాడు కనుక స్వామికి 'శరవనబహ్వుడు' అనే పేరు ఏర్పడింది. అంతేకాకుండా గంగానదిలో పడిన రేతస్సు ఆరు భాగాలుగా ఏర్పడింది. ఆ ఆరు భాగాలు అలల తాకిడికి ఏకమై ఆరు ముఖములు, పన్నెండు చేతులు, రెండు కాళ్ళతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అందువల్ల ఆయనకు 'షణ్ముఖుడు' అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా ఆవిర్భవించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పెంచేందుకు శ్రీమహావిష్ణువు ఆరు కృత్తికలను నియమించారు. వారు పెంచి పెద్ద చేశారు. ఆరు కృత్తికల చేత పెంచబడడం వల్ల స్వామికి 'కార్తికేయుడు' అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిపై దండెత్తి తారకాసురుడిని అంతమొందించి దేవతలను ప్రజలను రక్షించినట్లు కథనం.
ఓం నమో నారాయణాయ
వరకాల మూరళీమోహన్ గారి సౌజన్యంతో