హైదరాబాద్, జూన్ 13,
దేశప్రజలు కరోనా విలయతాండవంతో అల్లాడుతున్న సమయంలో ఎంతోమంది తామున్నామంటూ అండగా నిలబడ్డారు. అలాంటి వారిలో బహుభాషా నటుడుసోనూసూద్ ముందు వరుసలో ఉంటారు. ఇన్నాళ్లూ సినిమాల్లో విలన్‌గా కనిపించిన ఆయనలో హీరోని మించిన మానవత్వం ఉందా? అని అందరూ అవాక్కయ్యారు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే గంటల వ్యవధిలోనే వారికి సాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. కొంతమంది అయితే ఆయనకు ‘బ్రదర్ ఆఫ్ ద నేషన్’ అంటూ బిరుదు కూడా ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ దేని గురించి మాట్లాడినా వైరల్‌గా మారుతోంది. తాజాగా ఆయన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై చంద్రబాబు శనివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నటుడు సోనూసూద్‌తో పాటు వివిధ రంగాల నిపుణులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. కోవిడ్‌పై పోరాటంలో ఇద్దరి ఆలోచనలు కలవడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రబాబును ఉద్దేశించి ఆయన అన్నారు.తెలుగు రాష్ట్రాలు తనకు రెండో ఇల్లు లాంటివని, తన భార్య ఆంధ్రప్రదేశ్‌కి చెందినది కావడం తనకు సంతోషంగా ఉందని సోనూసూద్ అన్నారు. తనకు తెలుగు రాష్ట్రాలతో ఎంతో ఆత్మీయ అనుబంధం ఏర్పడిందని, కోవిడ్ సమయంలో తనకు తోచిన సాయం అందిస్తుండటం ఎంతో సంతృప్తిని ఇస్తోందని సోనూసూద్ చెప్పారు. కరోనా ప్రభావంతో ఎంతో మంది ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని, తనకు అర్థరాత్రి 2గంటల సమయంలోనూ సాయం కోసం ఫోన్ కాల్స్ వచ్చేవని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి సమయంతో సంబంధం లేకుండా సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తానని సోనూసూద్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే 18ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, తొలిదశలో భాగంగా కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్‌తో పాటు మరోచోట నాలుగు ప్లాంట్లు నెలకొల్పుతున్నామని తెలిపారు.