న్యూఢిల్లీ, జూన్ 13,
కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. జీఎస్‌టీ కౌన్సిల్ పలు ప్రొడక్టులపై జీఎస్‌టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, బిపాప్ మెషీన్స్, ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, వెంటిలేటర్లు, పల్స్ ఆక్సిమీటర్స్, కోవిడ్ టెస్టింగ్ కిట్స్ వంటి వాటిపై జీఎస్‌టీ తగ్గిస్తూ మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.వీటిపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం శనివారం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రం తరపున ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ అత్యవసర వస్తువులు, బ్లాక్ ఫంగస్ మందులపై పన్ను రేట్ల తగ్గింపు, ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతర వస్తువులపై జీఎస్టీ రాయితీ ఇచ్చే అంశాలను గుర్తించి చర్చించారు.జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. కరోనా మెడిసిన్స్, పరికరాలపై పన్నులను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే రెండు ఔషధాలు ఆంఫోటెరిసిన్ బీ, టోసిలిజుమాబ్‌కు జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. రెమ్‌డెసివిర్‌పై పన్ను 12 నుంచి 5 శాతానికి తగ్గించారు.అంబులెన్స్ సేవలపై జీఎస్టీ 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. వ్యాక్సినేషన్‌పై జీఎస్టీ 5 శాతం యథాతథంగా ఉంచారు. ఆక్సిజన్ యూనిట్లు, ఉత్పత్తి యంత్రాలపై జీఎస్టీ తగ్గించారు. కొవిడ్ మెడిసిన్స్, టెస్టింగ్ కిట్లు, పల్స్ ఆక్సీమీటర్లపై జీఎస్టీ తగ్గించారు. ఆక్సిజన్, మాస్కు, కొవిడ్ టెస్టు కిట్లు, పల్స్ ఆక్సిమీటర్లు, వెంటిలేటర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గించారు. కొత్త ధరలు సెప్టెంబర్ నెలఖారు వరకు అమల్లో ఉంటాయి అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.