YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హామీలు గుర్తు చేస్తు మరో లేఖ రాసిన రఘురామ... ప్రశ్నిస్తే వేటు వేయిస్తారా : రఘురామ...

హామీలు గుర్తు చేస్తు మరో లేఖ రాసిన రఘురామ...   ప్రశ్నిస్తే వేటు వేయిస్తారా : రఘురామ...

న్యూఢిల్లీ, జూన్ 13,
వైఎస్ జగన్ రెడ్డి సర్కార్‌కి వరుస షాకులిస్తున్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు. రాజద్రోహం కేసులో అరెస్టై బెయిల్‌పై వచ్చినప్పటి నుంచి మరింత దూకుడు పెంచారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే నేరుగా ఢిల్లీ వెళ్లిన రఘురామ జగన్ సర్కార్‌ను ఇరుకునబెట్టేలా కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదులు చేశారు. తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఎంపీలకు లేఖలు రాశారు. కందిపోయిన తన కాళ్ల ఫొటోలను జత చేసి మరీ అందరి మద్దతు కోరారు. ఆ తర్వాత ఒక్క జగన్ మినహా అందరు సీఎంలకు ఇదే విషయమై లేఖలు రాశారు.అంతటితో ఆగని రఘురామ నేరుగా జగన్‌ సర్కార్‌‌నే టార్గెట్ చేశారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపే పని తలకెత్తుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ లేఖలు రాయడం మొదలుపెట్టారు. వృద్ధాప్య పింఛన్లను రూ.3 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీకి ప్రజల నుంచి మద్దతు లభించిందని.. తక్షణం ఆ హామీ నిలబెట్టుకోవాలంటూ సీఎంకి లేఖ రాశారు. ఈ నెల నుంచే పింఛను రూ.2,750 చెల్లించాలని కోరారు. బకాయిలు కూడా ఇవ్వాలంటూ లేఖ రాసి సంచలనం రేపారు.మరుసటి రోజే రెండో లేఖతో చర్చనీయాంశం మారారు. ఎప్పటి నుంచో ఉద్యోగులు పోరాడుతున్న సీపీఎస్ రద్దుపై సీఎం జగన్‌కి రెండో లేఖ రాశారు. అధికారంలోకి 7 రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి 765 రోజులైందని.. ఆ విషయం తేల్చాలంటూ చురకలంటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడో లేఖ రాశారు. పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని రఘురామ కోరారు. పెళ్లి సాయాన్ని లక్ష రూపాయలకు పెంచుతామని ప్రకటించినట్లు లేఖలో పేర్కొన్నారు.ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేలా వ్యాఖ్యల చేశారని కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ రఘురామను అరెస్టు చేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం ఆయనకు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై బయటికి వచ్చిన నాటి నుంచి రఘురామ ఫిర్యాదుల పరంపర కొనసాగింది. తాజాగా ఆయన రఘురామ లేఖల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హీట్ రాజేస్తోంది.

జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రశ్నిస్తున్నందునే తన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ ఫిర్యాదు చేసిందని నర్సాపురం ఎంపీరఘురామకృష్ణరాజు అన్నారు. తాను ఏ పార్టీతోనూ జట్టుక‌ట్టలేద‌ని.. అధికార పార్టీ కార్యక‌లాపాల‌కు విరుద్ధంగా వ్యవ‌హ‌రించ‌లేదని పేర్కొన్నారు. వైసీపీ తరపున ఎంపీగా ఎన్నికైన రఘురామ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌ శుక్రవారం ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.దీనిపై రఘురామ స్పందిస్తూ... ప్రభుత్వ సంక్షేమ ఫ‌లితాల అమ‌లులో లోపాల‌ను మాత్రమే తాను ఎత్తి చూపిస్తున్నానని, తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదన్నారు. తాను కొంతమంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నం చేశానని, వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయన్నారు. తనపై దాడి చేసిన విషయంలో మరోసారి ప్రివిలైజ్ మోషన్ ఇస్తానని తెలిపారు. తనపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశారని రఘురామ తెలిపారు.రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలు సమర్పించామని భరత్ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజుపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని ఎంపీ భ‌ర‌త్ స్పీక‌ర్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

Related Posts