సంగారెడ్డి జూన్ 14
భూముల అమ్మకంపై కాంగ్రెస్, బీజేపీలు అనవసరమైన రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయి అని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. లింగంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. భూముల అమ్మకంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గింది. దీంతో సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు నిరర్ధక ఆస్తులు అమ్ముతామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పాము. పూర్తి పారదర్శకంగా భూములు అమ్మటం జరుగుతుంది అని మంత్రి స్పష్టం చేశారు.భూముల అమ్మకాన్ని కావాలని రాద్ధాంతం, రాజకీయ కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ తన 10 ఏండ్ల పాలనలో 88,500 ఎకరాల భూములు అమ్మారు. తెలంగాణలోని విలువైన భూములు అమ్మి ఆంధ్రాలో ఖర్చు చేశారు. నాడు భట్టి విక్రమార్క ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడేమో కావాలని రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంతో పాటు 24 సంస్థల నుంచి 45 సార్లు వాటాలను విక్రయించింది. పెట్టుబడుల ఉపసంహరణ చేస్తే ప్రోత్సహకాలు, ప్రైజ్‌లు ఇస్తామని రాష్ట్రాలకు లేఖ రాసింది.. ఆ లేఖను విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.