గుంటూరు, జూన్ 15,
రాష్ట్ర బీజేపీ నేతల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. త్వరలోనే ఏపీ నుంచి కీలక బీజేపీ నేతకు.. కేంద్ర కేబినెట్ లో చోటు కల్పిస్తారని.. ఆయన ప్రకాశం జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావేనని ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఇప్పటికిప్పుడు జీవీఎల్ నరసింహారావు పై ఇలా ప్రచారం సాగడానికి రీజనేంటి ? అనేది కూడా ఆసక్తిగా ఉంది. విషయంలోకి వెళ్తే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో 2019లో రెండోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఎన్డీయే, రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుంది.ఈ రెండేళ్లలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్వపక్ష, మిత్రపక్ష నేతల మరణాలు, దూరమైన మిత్రుల కారణంగా కేబినెట్ లో ఖాళీలు ఏర్పడ్డాయి. కోవిడ్ తొలి వేవ్‌లో కేంద్ర మంత్రిగా ఉన్న సురేశ్ అంగడి చనిపోగా, అనారోగ్య కారణాలతో మిత్రపక్షం లోక్‌జనశక్తి (ఎల్జేపీ) అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్ మృతి చెందారు. బీజేపీతో విబేధాల కారణంగా శివసేన తొలుత దూరమవగా, గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చిరకాల మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కూడా దూరమైంది. దీంతో మంత్రి పీఠాలు ఖాళీ అయ్యాయి.ఈ క్రమంలో త్వరలోనే అంటే.. మరో నెల రోజుల్లో కేంద్ర కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం ఉంది. దీంతో ఏపీ బీజేపీ నేతలు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్ లో ఏపీకి చోటు దక్కలేదు. దీంతో రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఇంటి కోడలైన నిర్మల సీతారామన్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ, ఆమె కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో పొరుగునే ఉన్న తెలంగాణలో 4 సీట్లు గెలుపొందిన బీజేపీ, ఏపీలో మాత్రం ఒక్క సీటునూ గెలుచుకోలేక పోయింది. ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ నేరుగా బీజేపీ నుంచి గెలుపొందినవారేమీ కాదు. అయితే ఈసారి విస్తరణలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కొత్తవారికి కేబినెట్ లో చోటు కల్పిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఈ పరిస్థితుల్లో ఏపీ నుంచి మంత్రయ్యే అవకాశం ఎవరికి ఉందనే చర్చ ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్ కి చెందినప్పటికీ, ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక, ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో జీవీఎల్ నరసింహారావు రాజకీయంగా పుంజుకుంటున్నారు. ఏపీలో పార్టీ తరపున ఎప్పటి నుంచో వాయిస్ వినిపిస్తున్నారు. ఈ సమీకరణల నేపథ్యంలో జీవీఎల్ కు మంత్రి పదవిపై ధీమా వచ్చిందని ఏపీ బీజేపీలో చర్చ నడుస్తోంది. మరి ఆయన ఆశలు ఎంత వరకు నెరవేరతాయో ? చూడాలి.