ముంబై, జూన్ 15,
కరోనా కాలంలోనూ రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ, అదానీ చీఫ్ గౌతమ్ అదానీల సంపద వేగంగా పెరుగుతూనే ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటికే అంబానీ సంపద 7.62 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.55,802 కోట్లు) పెరిగి 84 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.6,15,147 కోట్లు) చేరుకుంది. దీంతో ఆయన ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో 12వ స్థానంలో నిలిచారు. అంతేకాదు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. చైనా కుబేరులు జాక్ మా, ఝాంగ్ షాన్సన్ వంటి వారి వెల్త్‌ను కూడా దాటేసి రికార్డు సృష్టించారు. ఆసియాలో అత్యంత సంపన్నుడు కూడా ఈయనే! మరో గుజరాతీ అయిన గౌతమ్ అదానీ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 43.2 బిలియన్ డాలర్లు సంపాదించారు. దీంతో ఆయన మొత్తం సంపద ఏకంగా 77 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.5,63,884 కోట్లు) చేరుకుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో అదానీ14వ స్థానంలో నిలిచారని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. అంబానీ, అదానీలు స్టాక్ మార్కెట్ ర్యాలీల ఫలితంగా విపరీతంగా డబ్బు సంపాదించారు. నిఫ్టీ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 13 శాతం పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 12 శాతం పెరిగి రూ.2,215.80లకు ఎగిశాయి. అయితే రిలయన్స్ నెట్‌వర్క్18 మీడియా & ఇన్వెస్ట్‌మెంట్స్ షేర్లు 40–45 శాతం మధ్య పెరిగాయి.అదానీ గ్రూప్ కంపెనీలలో అదానీ టోటల్ గ్యాస్ షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 335 శాతం ర్యాలీ చేశాయి. గత నెల 11న దీని షేరు విలువ రూ. 1,625.8 కాగా, ఈ ఏడాది జనవరిలో రూ. 374.9 రూపాయలు మాత్రమే కావడం గమనార్హం. అదానీ ట్రాన్స్‌మిషన్ 264 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 235 శాతం పెరిగాయి. అదానీ పవర్ స్టాక్స్ 200 శాతం, అదానీ పోర్ట్స్ షేర్లు74 శాతం పెరిగాయి. అదానీ గ్రీన్ షేర్లు 17 శాతం శాతం ఎగిశాయి.బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ టాప్–100 సంపన్నుల్లో మనదేశం నుంచి విప్రో అధిపతి అజీమ్ ప్రేమ్‌జీ (42 వ స్థానం), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ శివ నాడార్ (72 వ), లక్ష్మి మిట్టల్ (88 వ)లకు చోటు దక్కింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి వరల్డ్ రిచెస్ట్ పర్సన్‌గా రికార్డుల్లో నిలిచారు. ఆయన సంపద విలువ డాలర్లు 194 బిలియన్ డాలర్లకు పెరిగింది. లూయిస్ విటన్ వంటి లగ్జరీ బ్రాండ్ల అధిపతి ఎల్‌వీఎంహెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కు రెండోస్థానం దక్కింది. ఈయన సంపాదను 173 బిలియన్ డాలర్లుగా లెక్కించారు. 169 బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా బాస్ ఎలన్ మస్క్ మూడవ స్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ (145 బిలియన్ డాలర్లు) , ఫేస్‌బుక్ సీఈఓ జుకర్‌బర్గ్ (124 బిలియన్ డాలర్లు) వరుసగా 4,5వ స్థానాల్లో ఉన్నారు. గూగుల్ చీఫ్ లారీ పేజ్, సెర్జీ బ్రిన్, వారెన్ బఫెట్ వంటి ఇతర బిలియనీర్ల పేర్లు కూడా బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో ఉన్నాయి.
ఫ్రాన్స్‌కు చెందిన ఆర్నల్ట్, ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ మినహా మిగతా వారందరూ అమెరికన్లు. వీరందరికీ అంబానీ కంటే ఎక్కువ సంపద ఉంది.
డ్రింక్స్ కంపెనీ నాంగ్ఫూ స్ప్రింగ్ ఫౌండర్, బీజింగ్ వాంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ ఓనర్ ఝాంగ్ షాన్షాన్ ఈ జాబితాలో అత్యంత సంపన్న చైనీయుడిగా నిలిచారు. తన సంపద 2021 లో 7 బిలియన్ డాలర్లు తగ్గి 71.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫౌండర్, సీఈఓ మా హువాటెంగ్ (21 వ), అలీబాబా ఫౌండర్ జాక్ మా (27 వ), బైట్‌డాన్స్ ఫౌండర్ జాంగ్ యిమింగ్ (32 వ) ఈ–-కామర్స్ మొఘల్ కోలిన్ హువాంగ్ (33 వ) బ్లూమ్‌బర్గ్ జాబితాలోని ఇతర చైనా పారిశ్రామికవేత్తలు.