న్యూఢిల్లీ జూన్ 15
గల్వాన్ ఘర్షణ పై కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఏడాది కాలం ముగిసినా.. చైనా ఇంకా భారతీయ భూభాగాన్ని ఆక్రమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. 20 మంది అమర జవాన్ల కుటుంబాలు కేంద్ర ప్రభుత్వం నుంచి బదులు కోసం ఎదురు చూస్తున్నాయని, ప్రధాని మోదీ వరుసగా అబద్దాలు చెబుతున్నట్లు ఇవాళ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆరోపించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను సగర్వంగా స్మరిస్తున్నామని సోనియా అన్నారు. అయితే దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ఏప్రిల్ 2020 కన్నా ముందు ఉన్న పరిస్థితిని నెలకొల్పేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేపట్టారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సోనియా వెల్లడించారు. చైనాతో జరిగిన దళాల ఉపసంహరణ ఒప్పందం వల్ల భారత్‌కు మేలు జరగలేదని ఆమె విమర్శించారు. గల్వాన్ ఘర్షణకు ఏడాది పూర్తి అయ్యింది. గత ఏడాది చైనా సైనికులు చేసిన ఆకస్మిక దాడిలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన రోజు ఇది.