YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

టార్గెట్ 2024 పీకేతో దీదీ ఒప్పందం

టార్గెట్ 2024 పీకేతో దీదీ ఒప్పందం

న్యూఢిల్లీ, జూన్ 15, 
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఘన విజయం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక భూమిక పోషించారు. బీజేపీ ఎత్తులకుపై ఎత్తులు వేసి కాషాయ పార్టీని 100లోపు సీట్లకే మమత నిలువరించగలిగారంటే అది పీకే వ్యూహమే. ఈ నేపథ్యంలో ఐ-ప్యాక్‌తో 2026 వరకు తృణమూల్ కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది. అయితే, ఐ-ప్యాక్ నుంచి తప్పుకుంటానని ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పీకే లేకుండా తొమ్మిది సభ్యుల కొత్త నాయకత్వం ఏ మేరకు విజయవంతమవుతుందనే ఆసక్తి నెలకుంది.కొత్త ఒప్పందం ప్రకారం పంచాయతీ సహా రాష్ట్రస్థాయి ఎన్నికల్లోనూ ఐ-ప్యాక్ భాగస్వామ్యం కానుంది. మరో ఐదేళ్లు అంటే 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వరకూ కొనసాగనుంది. ఈ సమయంలో యూపీ, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల అసెంబ్లీ సహా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా, బెంగాల్ వెలుపల కూడా తృణమూల్ కాంగ్రెస్‌ను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని ఆ పార్టీ నేత పార్థ ఛటర్జీ ప్రకటించిన వారం తర్వాతే ఐ-ప్యాక్‌తో ఒప్పందం మరో ఐదేళ్లు పొడిగించారు.మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ సైతం ఇటీవల ఈ విధమైన వ్యాఖ్యలే చేశారు. ఇదే సమయంలో ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను ప్రశాంత్ కిశోర్ కలవడంతో ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే బాధ్యతను ఆయన భుజాలకెత్తుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీపై ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా మమతా బెనర్జీని తెరపైకి తీసుకొస్తారనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి.ఎన్నికల్లో విజయం అనంతరం దీదీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది ప్రజాస్వామ్యం.. ఇది ప్రజల ఎంపిక.. ఈ రోజున బీజేపీని ఓడించవచ్చని నిరూపించారు’ అని వ్యాఖ్యానించారు. అయితే, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి విషయంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘కొన్నిసార్లు అన్ని విషయాలను నిర్ణయించలేరు.. ఎన్నికల సమయంలో ఇది భిన్నంగా ఉంటుంది. కనీస ఉమ్మడి కార్యక్రమం ఉండాలి ... ఇప్పుడు కోవిడ్ యుద్ధంతో పోరాడాల్సిన సమయం వచ్చింది.. ఈ యుద్ధం ముగిసిన తరువాత మేము నిర్ణయిస్తాం.. దేశం దీనిని ఎదుర్కోదు ... బీజేపీ అంటే విపత్తు’’ అని అన్నారు.గత కొద్ది నెలలుగా కేంద్రంలో అధికారం చేపట్టడానికి బీజేపీయేతర పార్టీల నేతలను ఒక్కతాటికి రావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చినవారిలో మమతా బెనర్జీ ముందున్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సహా ప్రతిపక్ష నేతలకు ఈ ఏడాది మార్చిలో దీనిపై లేఖ రాశారు. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ వ్యతిరేక కూటమికి మమతా బెనర్జీ నాయకత్వం వహించాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి.

Related Posts