YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*పూజ విషయం లో అలసత్వానికి చోటే లేదు*

*పూజ విషయం లో  అలసత్వానికి చోటే లేదు*

రోజూ తెల్లవారుఝామున నాలుగున్నరకు లేచే అలవాటుందనుకోండి. ఎప్పుడైనా తెల్లవారకట్ట మూడు గంటలకి విమానానికి వెళ్ళిపోవాలనుకోండి. ఆరోజున నాకు నాలుగున్నరకే అలవాటండీ విమానం ఎక్కడానికి ఇంకొక తేలికమార్గమేమైనా ఉంటుందా? నాకోసం ఉండడానికి అన్న ప్రశ్న ఉంటుందా? ఉండదు. నీకు విమానం ఎక్కి లక్ష్యం చేరాలనుకుంటే మూడు గంటలకు లేవడం ఒక్కటే మార్గం. అలా సమయం లేకపోవడం భగవదారాధనకి అన్నమాట ఉండదు. ఈశ్వరుడు కూడా అదేమాట అంటే? నేనూ చాలా హడావుడిగా ఉన్నానయ్యా, సూర్యచంద్రుల్ని ప్రకాశింపజేయాలి, నక్షత్రాలు క్రిందపడిపోకుండా ఆపాలి, భూమిని ఒకేవేగంతో తిప్పాలి, ఋతువులు ఏర్పడాలి, ఏ ఋతువుకి ఆఋతువులో ధర్మం వచ్చేటట్లు చూడాలి, ఇంతమంది ఊపిరి తీసుకునేటట్లు చూడాలి, నీ విషయం పట్టించుకోవడం కొంచెం కష్టం అంటే? కాబట్టి పూజ విషయంలో అలసత్వం అన్న మాటకి తావే లేదు. ప్రతిరోజూ అయిదు గంటలకి నిద్ర లేవగలిగితే భక్తితో కూడిన ఆరాధన చేయాలి అనే తాపత్రయం ఉంటే నాలుగింటికి లేవడమ్ పెద్ద కష్టమైన పనేం కాదు. ఆ గంట ఈశ్వరుడికోసం వినియోగించవచ్చు. శాస్త్రంలో ఒక మినహాయింపునిచ్చారు. ఎప్పుడిచ్చారు ఆ మినహాయింపు అంటే దేహమునకు అస్వస్థతగా వుండి, షోడశోపచారములు, శ్రీసూక్త పురుషసూక్తములు చెప్పి చేసే ఓపిక లేదు. అప్పుడు ఈశ్వరుడు నువ్వు చేసి తీరవలసిందే అనడు. లఘువు అయిపోతుంది. ఎలా?
లక్ష్మీనారాయణాభ్యాం నమః - ఆవాహయామి - ఒక నమస్కారం
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి; పాదయోః పాద్యం సమర్పయామి; ముచే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి; వస్త్ర ద్వయం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి; చందనం సమర్పయామి; నైవేద్యం సమర్పయామి; నీరాజనం. అయిదు నిమిషాలు కూడా పట్టదు. మనస్సు నిలబడితే చాలు. మనసుతో భావన చేస్తే అందిపోతుంది ఈశ్వరుడికి. మనస్సు ప్రధానం.
"భావనామాత్ర సంతుష్టాయై నమోనమః". నామాల దగ్గరికి వచ్చేసరికి రోజూ సహస్రం చేసే వారు నూటఎనిమిది చేద్దామనుకుంటే దానికీ ఓపికలేదు. అప్పుడు మన తరపున పార్వతీ దేవి అడిగింది పరమశివుణ్ణి- "కేనోపాయేన లఘునా" - శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే!
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!!" పరమ భక్తితో చేతులు కైమోడ్చి రామ! రామ! రామ! అని మూడు మార్లు అను. సహస్రనామాలు చెప్పినట్లే.
సంస్కృతంలో ఒక మర్యాద ఉంది. అక్షరాలను అంకెలలోకి తర్జుమా చేస్తారు.
రా = 2; మ = 5
రామ రామ రామ
2x5 x 2x5 x 2x5 = 1000
వెయ్యినామాలతో పూజ చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తాడు. కానీ నేను ఏడింటికి లేచి ఇది చెప్పి వెళ్ళిపోతాను అంటే కాదు. నిజంగా ఓపిక లేకపోతే ఈశ్వరుడు ఎప్పుడూ మినహాయింపు ఇస్తాడు. ఈ మినహాయింపులన్నీ భగవంతుడి దగ్గరనుంచే నేర్చుకున్నారు. స్నానానికి ఓపిక లేదు. విభూతి తీసుకొని చల్లుకుంటే స్నానం అయిపోయినట్లే. లేచి విభూతి చల్లుకోవడానికి ఓపిక లేదు. పళ్ళెంమీద చెయ్యి వేస్తే కొడుకు చేస్తాడు పూజ. గోవిందా! అంటే చాలు.
"గోవిందేతి సదాస్నానం" - గోవిందనామానికున్న గొప్పతనమంతా అక్కడుంది. గోవిందా అని ఒకమాట అను. స్నానం అయిపోయినట్లే. ఎప్పుడు? స్నానం చేయడానికి ఆరోగ్యం అనుమతించకపోతే. కాబట్టి నిజంగా సమయం లేకపోతే లఘువుగా పూజ చెయ్యి.
లఘువుగా శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే!
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!!"అని ఒక్క పువ్వు వెయ్యి. సహస్రనామాలతో పూజచేసి బయలుదేరినట్లే.
కానీ సాధ్యమైనంత వరకు పూజయందు మాత్రం అన్నింటికీ మినహాయింపులు పుచ్చేసుకుని పూజని ఎగ్గొట్టడానికి
ఎన్ని మార్గాలుంటాయి అన్న ఆలోచన మాత్రం చేయకూడదు. పూజ అంటే కృతజ్ఞత చెప్పడం. అన్నివేళలా మినహాయింపు కోరకూడదు. అవసరమైనప్పుడు వాడుకుంటే ఈశ్వరుడు కోప్పడడు. అసలు 64 ఉపచారాలు చేయాలి రోజూ. చతుష్షష్ట్యుపచారాఢ్యా - చేయలేక పోతే షోడశోపచారాలు చేయాలి. అదీ చేయలేకపోతే పంచోపచారాలు చేయాలి. పంచసంఖ్యోపచారిణీ - గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు ఇవ్వాలి. ఇవి కూడా ఇవ్వననడం మర్యాదతో కూడుకున్న వ్యవస్థ కాదు.
రోజూ ఖాళీలేదండీ తక్కువ పూజ చేస్తాం మార్గం ఉందా? వారంలో సెలవున్న రోజైనా పూజ ఎలా పెంచుకోవచ్చు అన్న ప్రశ్న అడగలేదు. సమయంలేని రోజు తగ్గిస్తావు. ఉన్నరోజు ఉంటుంది కదా! ఆరోజు టివి ఎందుకు చూస్తావు? గంట పూజకి పెంచాలిగా! అప్పుడు పెంచడం కూడా నేర్చుకోవాలిగా. అప్పుడు షోడశోపచారములు చేసి, పూజకు ముందు పనులు కూడా నువ్వే చేసుకొని పరమప్రీతితో మిగిలిన వెయ్యి నామాలు చెప్పుకొని మనసునిండా రమించి ఆరురోజులు ఐదు ఉపచారాలు లఘువుగా చేసినా పట్టించుకోడు. పరిపూర్ణమైన అనుగ్రహాన్ని వర్షిస్తాడు.
Courtesy: చాగంటి వారి ప్రవచనాల నుండి..
 

Related Posts