కాకినాడ, జూన్ 16,
తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇది ఊహించనిది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తోట త్రిమూర్తులు వైసీపీలోకి చేరారు. ఆయన గతంలో అనేక పార్టీలు మార్చిన చరిత్ర ఉంది. టీడీపీలో కీలక నేతగా ఉన్న తోట త్రిమూర్తులు వైసీపీలోకి వస్తే మరింత బలం పెరుగుతుందని భావించి ఆయనకు వైసీపీ అధినేత కండువా కప్పేశారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీని చేశారు. దీంతో తోట త్రిమూర్తులుకు అంత ప్రయారిటీ జగన్ ఎందుకు ఇచ్చారన్న చర్చ మొదలయింది.తోట త్రిమూర్తులు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి కాంగ్రెస్ నుంచి, రెండుసార్లు టీడీపీ నుంచి విజయం సాధించారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో మాత్రమే కాకుండా కాపు సామాజికవర్గంలో పట్టున్న నేతగా తోట త్రిమూర్తులుకు పేరుంది. అందువల్లనే ఆయనను జగన్ పార్టీలోకి తీసుకున్నారు.ఇక తోట త్రిమూర్తులుకు ఇంత ప్రయారిటీ ఇవ్వడం కూడా పార్టీ నేతలకు నచ్చడం లేదు. ఇప్పటికే రామచంద్రాపురం నియోజకవర్గంలో మూడు గ్రూపులున్నాయి. ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుబాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు గ్రూపులుగా ఉన్నాయి. తోట త్రిమూర్తులు ప్రస్తుతం మండపేట బాధ్యతలను చూస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ గా ఎంపిక చేయడంతో తోట త్రిమూర్తులు రామచంద్రాపురంలో వేలు పెడతారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.ఇప్పటికే పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ నిర్ణయాల పట్ల అసంతృప్తితో ఉన్నారు. తోట త్రిమూర్తులను పార్టీలో చేర్చుకునేటప్పుడే అయిష్టత కనపర్చారు. ఇప్పుడు జగన్ ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వడంతో రామచంద్రాపురం నియోజకవర్గంలో వర్గ విభేదాలు మరింత ముదిరే అవకాశముందంటున్నారు. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రయారిటీ ఇవ్వడంపైన కూడా వైసీపీలో చర్చ మొదలయింది.