YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ప్రైవేట్ సంస్థలకు బంగారం తవ్వకాలు..

 ప్రైవేట్ సంస్థలకు బంగారం తవ్వకాలు..

కర్నూలు, జూన్ 16, 
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి, జన్నగిరి ప్రాంతాల్లోని బంగారు గనులు ప్రైవేటుపరం కానున్నాయి. గనుల్లో తవ్వకాల పనులను ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు కట్టబెట్టింది. దీంతో దేశంలోనే తొలి ప్రైవేటు గోల్డ్‌ మైన్స్‌ ఇదే కానుంది. తుగ్గలి మండలంలోని ఎర్రమట్టి నేలల్లో జియోలాజికల్‌ సర్వే నిపుణుల సుదీర్ఘ పరిశోధనల తరువాత బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తేల్చారు. 1550 ఎకరాల్లో ఆ నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనేక కంపెనీలు సర్వేలు నిర్వహించిన అనంతరం బంగారం ఉన్నట్లు నివేదికలు ఇచ్చిన తరువాత తవ్వకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గోల్డ్‌ మైన్‌ను దక్కించుకునేందుకు అనేక బడా కంపెనీలు పోటీపడ్డాయి. చివరకు ఆ అవకాశాన్ని ఆస్ట్రేలియన్‌ ఇండియన్‌ రీసోర్సెస్‌ లిమిటెడ్‌ (ఎఐఆర్‌ఎ) గ్రూపునకు చెందిన జియోమైసూర్‌ సర్వీసెస్‌ దక్కించుకుంది. 2013లోనే సదరు సంస్థ గ్రామస్తులతో ఒప్పందం కుదుర్చుకుని పరిశోధనలు కూడా మొదలుపెట్టింది. 30 ఏళ్ల లీజుకు రైతుల నుంచి భూములను తీసుకుంది. ఎకరాకు ఏడాదికి రూ.16,500 లీజు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. పరిశోధనలు, సర్వేలు చివరి దశకు చేరుకోవడంతో వచ్చే ఏడాది నుంచి బంగారం తవ్వకాలు పనులు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సదరు సంస్థ చకచకా ఏర్పాట్లను చేసుకుంటోంది. తవ్వకాలకు కావాల్సిన యంత్రాలను ఇతర దేశాల నుంచి తెచ్చుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. తొలి దశలో 300 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టే యోచనలో ఆ కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. రోజుకు పది వేల టన్నుల మట్టిని తీసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఒక టన్ను మట్టి తీస్తే 1.5 గ్రాముల బంగారం వస్తుందని నిపుణులు అంచనా వేశారు. ఏడాదికి 750 కిలోల బంగారం వెలికితీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో తవ్వకాలు చేపట్టే 300 ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేయాలని, ఎకరాకు రూ.12 లక్షలు ఇవ్వాలని ఆ సంస్థ యోచిస్తోంది. ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించి, ఉద్యోగావకాశాలు కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. మైనింగ్‌ పనులు ప్రారంభిస్తే ఏర్పడే కాలుష్యం నుంచి ఆయా గ్రామాలను కాపాడేలా ప్రభుత్వం, సదరు సంస్థ చరర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోనే కాకుండా రాయలసీమలోని ఇతర ప్రాంతాల్లోనూ బంగారం వెలికితీసేందుకు అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చిగురుకుంట, బిసానాట్టం మధ్య వెయ్యి ఎకరాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని గుర్తించి గతంలోనే తవ్వకాలు చేపట్టారు. 2001లో ఆ మైన్స్‌ను మూసేశారు. అనంతపురం జిల్లాలోని రామగిరి మండలంలో 320 ఎకరాల్లోనూ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. వాటన్నిటిలో బంగారు తవ్వకాలు చేపడితే రాయలసీమ స్వర్ణసీమగా మారుతుందని సీమ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts