విజయవాడ, జూన్ 16,
రెవెన్యూ శాఖలో అవినీతిని నిర్మూలించేందుకు విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా ఆ శాఖలో చేయి తడపందే కార్యాలయాల్లో ఫైళ్లు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అవినీతి నిరోధకశాఖ (ఎసిబి) దాడులు చేస్తూనే ఉంది. మరో వైపు రెవెన్యూలో జరిగే అక్రమాల గురించి విజిలెన్స్ విభాగానికి అందే ఫిర్యాదులు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో వందలాది ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందుతున్నాయి. జిల్లా స్థాయిలో తహశీల్దారు కంటే ఎక్కువ స్థాయి అధికారులపైన వచ్చే ఫిర్యాదులను ఆయా జిల్లా కలెక్టర్ శాఖాపరమైన విచారణ చేపడతారు. తహశీల్దార్లపై నేటికీ పలు దశల్లో విచారణ జరుగుతున్న కేసులు 683 ఉన్నాయి. గతేడాది 2020ా21లో 85 విజిలెన్స్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది కేవలం మూడు నెలల కాలంలోనే 35 కేసులు నమోదయ్యాయంటే మండల స్థాయిలో అధికారులు ఎంత నిక్కచ్ఛిగా పనిచేస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. భూ లావాదేవీలతో పాటు పౌర సరఫరాల శాఖలో రేషన్ షాపులపై దాడులు తదితర అంశాలపై నమోదు చేసే 6(ఎ) కేసులు సరేసరి. పాత కేసుల్లో విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న వాటిలో కొంతమంది ఉద్యోగ విరమణ చేసిన వారూ ఉన్నారు. కొందరిపై శాఖా పరమైన చర్యలు తీసుకోగా, మరికొంతందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదై అరెస్టైన వారూ ఉన్నారు. విజిలెన్స్ విభాగానికి వచ్చే ఫిర్యాదుల్లో అత్యధిక శాతం వెబ్‌ల్యాండ్‌లో పేరుమార్పు, భూమి విస్తీర్ణంలో తేడాలు, మ్యుటేషన్, సర్వే సబ్ డివిజన్లలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోంది. ఇటువంటి కోవకు చెందిన ఫిర్యాదులే అత్యధికంగా వస్తున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఒక వైపు విజిలెన్స్, మరొక వైపు విజిలెన్స్ ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ రెవెన్యూలో అవినీతి ఏ మాత్రం తగ్గలేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విజిలెన్స్ విభాగంలో ఇలా ఫిర్యాదులు అందుతుంటే ఎసిబి దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గత మూడేళ్లలో ఎసిబి నమోదు చేసే కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని సమాచారం. ఏదేమైనప్పటికీ రెవెన్యూ శాఖలో చేయి తడపందే ఫైలు ముందుకు కదలడం లేదనేది పలువురు పేర్కొంటున్నారు.