YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొంప ముంచిన సంచయిత దూకుడు

కొంప ముంచిన సంచయిత దూకుడు

విజయనగరం, జూన్ 16, 
గోడ ఎదురుగా ఉంటే దూకుడుగా వెళ్తే ఏం జరుగుతుంది. ముక్కు పచ్చడి అయి ముఖం రూపురేఖలు మారిపోతాయి. ఏపీలో జగన్ సర్కార్ తీరు కూడా అలాగే ఉంది అంటున్నారు. చట్టవిరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటూ కోర్టులలో అవి వీగిపోతూంటే అభాసుపాలు కావడం ఒక అలవాటుగా మారిపోయింది అన్నదే అందరి మాట. కేంద్ర మాజీ మంత్రి, పూసపాటి సంస్థానాధీశుడు అశోక్ గజపతిరాజు విషయంలో దూకుడుగా వెళ్ళిన పుణ్యానికి ఇపుడు ఏకంగా జగన్ సర్కార్ పరువు మర్యాదలు మంటగలిశాయి అంటున్నారు. జగన్ సర్కార్ తెచ్చి నెత్తి మీద కిరీటం పెట్టేవరకూ సంచయిత గజపతిరాజు ఎవరో జనాలకు తెలియదు. ఆమె అశోక్ గజపతి రాజు అన్న ఆనందగజపతిరాజు మొదటి భార్య కుమార్తె. అయితే ఆమె తన తండ్రి తరఫున మాన్సాస్ లో తన హక్కుల కోసం పోరాడుతున్నారు. అది పూర్తిగా పూసపాటి వారి అంతపుర వ్యవహరం. ఈ విషయంలో తెలిసి కూడా ఎవరూ మధ్యలోకి దిగరు. కానీ సంచయితను ముందు పెట్టి జగన్ సర్కార్ ఏకంగా మాన్సాస్ ట్రస్ట్ పాలకవర్గాన్ని మార్చేసింది. అలాగే సుప్రసిధ్ధ సింహాచలం ఆలయ చైర్ పర్సన్ గా సంచయిత గజపతిరాజు ను నియమించింది. అశోక్ ని రాత్రికి రాత్రి పదవిని నుంచి తప్పించేసింది. దీంతో ఇక్కడే సర్కార్ తప్పులో కాలేసింది అని అంతా నాడే అన్నారు.వంశ‌పార‌ప‌ర్యంగా వ‌స్తున్న మాన్సాస్ ట్రస్ట్ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. కుటుంబంలో ఎవరు పెద్ద వారు ఉంటే వారే ట్రస్టీగా ఉండాలని రూల్స్ ఫ్రేమ్ చేశారు. కానీ కాదని సంచయిత గజపతిరాజు ను తెచ్చి పెట్టడం చేతనే ఈ రోజు సర్కార్ అవమానం పాలు అయింది. పైగా సంచయిత ఏమీ వైసీపీకి విధేయురాలు కాదు, ఆమె ఆ పార్టీ మెంబర్ అంతకంటే కాదు, ఆమె బీజేపీకి చెందిన వారు. చిత్రమేంటి అంటే ఇక్కడ బీజేపీ వారు కూడా ఆమె నియామకాన్ని ఏ మాత్రం సమర్ధించలేదు. అలా అశోక్ విషయంలో చేసిన తప్పిదాల వల్ల జగన్ సర్కార్ ఇపుడు భారీ మూల్యం చెల్లించింది అంటున్నారు.మరో వైపు సంచయిత గజపతిరాజు తీసుకున్న అనేక నిర్ణయాలు కూడా వివాదాస్పదంగా మారాయి అని అంటున్నారు. ఆమె మాన్సాస్ ఆఫీస్ ని కోట నుంచి తరలించడం, ఎమ్మార్ కాలేజీ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూడడం వంటివి అనేకం ఉన్నాయి. అలాగే ఎక్కడో చెన్నై నుంచి ఒక వ్యక్తిని తెచ్చి ఆయనకు అటు సింహాచలం, ఇటు మాన్సాస్ వ్యవహారాలలో పెద్ద పీట వేయడం వంటివి కూడా ఉన్నాయి. ఏది ఏమైనా సంచయిత గజపతిరాజు వల్ల వైసీపీకి ఏ మాత్రం ప్లస్ కాలేదు, కానీ అశోక్ ని తొలగించడం వల్ల మాత్రం భారీ మైనస్ అయింది. పూసపాటి రాజులకు మూడు జిల్లాల్లో రాజకీయాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. వారి మనోభావాలు దెబ్బతీశారు అన్న చెడ్డ పేరు కూడా వచ్చింది. ఇకనైనా దూకుడు తగ్గించి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి అపప్రధ రాదు అన్నదే వైసీపీ పెద్దలకు హితైషులు చెప్పే మాట.

Related Posts