విశాఖపట్టణం, జూన్ 17,
విశాఖ సౌత్ నుంచి రెండు సార్లు టీడీపీ తరఫున గెలిచి ఇపుడు వైసీపీకి మద్దతు ప్రకటించిన వాసుపల్లి గణేష్ కుమార్ తన స్టైల్ ఎపుడూ సెపరేటే అంటారు. ఆయన ముందు డిఫెన్స్ లో పనిచేశారు. ఆ మీదట స్వచ్చంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇక 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి ఆయనలో సేవాభావం మాత్రం అలాగే ఉంది. అందుకే మిగిలిన ఎమ్మెల్యేల కంటే కూడా ఆయన డిఫరెంట్ అని ఎపుడూ అనిపించుకుంటున్నారు. ఇక ఏ పార్టీలో ఉన్నా కూడా తన ఐడెంటిటీని కోల్పోని వాసుపల్లి గణేష్ కుమార్ తాజాగా చేసిన పనికి క్యాడర్ ఫిదా అవుతోందిట.తన నియోజకవర్గంలో ఉన్న 14 వార్డులలోని ముఖ్యమైన క్యాడర్ ని గుర్తించి వారికి పెద్ద ఎత్తున ఆర్ధిక సాయం చేయడం ద్వారా వాసుపల్లి గణేష్ కుమార్ తాజాగా వార్తల్లోకి ఎక్కారు. ప్రతీ వార్డులో ఇరవై మంది దాకా ముఖ్య కార్యకర్తలను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ అయిదు వేల రూపాయల దాకా ఎమ్మెల్యే ఆర్ధిక సాయం చేశారు. కరోనా వేళ వారంతా ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకుని మరీ ఇలా 14 లక్షల రూపాయలను తన సొంత డబ్బు నుంచి బయటకు తీసి ఆదుకోవడం అంటే విశేషమే మరి.ఇక ఎమ్మెల్యే తన నియోజకవర్గం వరకూ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రజలకు ఉపయోగకరమైన సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. కరోనా దెబ్బకు ఇంట్లో ఆకలితో పోరాటం చేస్తున్న వారికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిత్యావసరాలను ఇచ్చి ఆదుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పధకాల విషయంలో కూడా ఆయన మంచి అవగాహనతో ఏ ఒక్కరూ పక్కకూ పోకుండా లబ్ది కలిగించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఠంచనుగా తన పార్టీ ఆఫీసులో ప్రజలను కలవడం, అలాగే క్యాడర్ కి ఎల్లపుడూ అందుబాటులో ఉండడం ద్వారా వాసుపల్లి దూసుకుపోతున్నాడు అనే చెప్పాలి.
హ్యాట్రిక్ విజయం కోసం చూస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ ని ఢీ కొట్టడం కష్టమేనని ఇతర పార్టీలు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చేశాయి. అందుకే వైసీపీ తెలివిగా ఆయన్ని తమ వైపునకు తిప్పుకుంది. మరో వైపు చూస్తే విశాఖ సౌత్ తెలుగుదేశంలో వాసుపల్లి లేని లోటు గట్టిగా కనిపిస్తోంది. ఆయనను రీప్లేస్ చేసే లీడర్ లేక టీడీపీ అల్లాడిపోతోంది. పార్టీ ఇమేజ్ ఒక వైపు ఉంటే తన వ్యక్తిగత ప్రతిష్టను కూడా పెంచుకుని వాసుపల్లి గణేష్ కుమార్ భారీ మెజారిటీతో ముచ్చటగా మూడవసారి గెలిచేందుకు అపుడే సిద్ధపడుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా అటు క్యాడర్ ని ఇటు జనాలను గుర్తు పెట్టుకుని ముందుకు సాగడం అంటే గ్రేటే అని చెప్పాలి.