విజయవాడ, జూన్ 17,
ఏపీలో పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీ.. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కడా పుంజుకోలేదు. కానీ, వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వంలోకి రావాలని మాత్రం కలలు కంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేలా.. ప్రజా ఉద్యమాల బాటపట్టాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా .. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ తమకు అనుకూలంగా వ్యవహరించాలని కూడా బీజేపీ నేతలు కోరుతున్నారన్న ప్రచారం అయితే ఉంది. ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా ఉన్న విశ్వభూషణ్ హరిచందన్ మాత్రం ఈదిశగా ఇప్పటి వరకు అడుగులు వేయలేదు. నిజానికి జగన్ ప్రభుత్వాన్ని గవర్నర్ ఇరుకున పెట్టాలని బీజేపీ మాత్రమే కాదు.. ఈ పార్టీ నేతల కంటే.. కూడా టీడీపీ నేతలు ఎక్కువగా కోరుతున్నారు. ఇటీవల గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల నామినేషన్ విషయంలో సంబంధిత ఫైల్ కొన్ని రోజులు నిలిచిపోవడం.. హుటాహుటిన సీఎం జగన్ వెళ్లి గవర్నర్‌తో చర్చించడం.. తెలిసిందే. అయితే.. ఈ విషయంలో గవర్నర్ ఎక్కువగా పట్టుబట్టకుండా.. సీఎం జగన్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో అమరావతి మార్పు విషయంలోనూ గవర్నర్ మౌనంగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ను మార్చాలనే డిమాండ్ బీజేపీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. గతంలో పుదుచ్చేరి గవర్నర్ వ్యవహరించిన తీరులో.. ఏపీలోనూ గవర్నర్ యాక్టివ్‌గా ఉంటూ.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడితే.. తప్ప.. తాము పుంజుకునే పరిస్థితి లేదని కొందరు సీనియర్లు.. కేంద్రం వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. అయితే.. ఇప్పటికిప్పుడు కాకుండా.. ఎన్నికలకు రెండేళ్ల ముందు నిర్ణయం తీసుకునే విషయం పరిశీలనలో ఉందని కూడా బీజేపీ నేతల మద్య చర్చ సాగుతోంది. దీంతో గవర్నర్ మార్పు ఖాయమని కొందరు అంటుంటే.. జగన్‌కు, కేంద్రంలోని బీజేపీ పెద్దలకు వివాదాలు లేనందున ఈ మార్పు ఉండకపోవచ్చని మరికొందరు అంటున్నారు. ఇక ప్రస్తుతం జగన్ అవసరమే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్డీయేలకు ఎక్కువుగా ఉండే పరిణామాలు ఉండడంతో ఏపీ బీజేపీ నేతల పాచికలు పారే అవకాశమే లేదు.