YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రైతు భరోసాల్లో...కనిపించని భరోసా

రైతు భరోసాల్లో...కనిపించని భరోసా

రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పాదకాలను ఒకే చోట అందుబాటులో ఉంచేందుకంటూ ప్రభుత్వం ఊరూరా నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లో ఎరువుల ధరలు బహిరంగ మార్కెట్‌లో ప్రైవేటు డీలర్ల వద్ద కంటే ఎక్కువ పలుకుతున్నాయి. గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పి) కంటే అధిక రేట్లను ఆర్‌బికెలలో వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు సంస్థల ఎరువుల విషయంలోనే ఈ విధంగా జరుగుతోందని, ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వంలోని కొందరి ప్రమేయం ఉందని ఆరోపణలస్తున్నాయి. ప్రభుత్వ పరిధిలోని ఆర్‌బికెలలో ఎంఆర్‌పి కంటే అధిక ధరలకు ఎరువులను రైతులకు ఆమ్మడం విస్మయం కలిగిస్తోంది. కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (సిఐఎల్‌) కంపెనీకి చెందిన  కాంప్లెక్స్‌ ఎరువును ఖరీఫ్‌ అవసరాల కోసం ఆర్‌బికెలలో రైతులకు అందుబాటులో ఉంచారు. యాభై కిలోల బస్తా ఎంఆర్‌పి రూ.1,725గా పేర్కొన్నారు. దానిలో కేంద్ర ప్రభుత్వం రూ.462.10 సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. కేంద్ర సబ్సిడీ పోగా డీలర్లు రూ.1,262.90కి రైతులకు అమ్మాలి. కానీ ఆర్‌బికెలలో రూ.1,376కు విక్రయిస్తున్నారు. ఆర్‌బికెలలోని డిస్‌ప్లే బోర్డులలో ఆ ధరను అధికారికంగా ప్రకటించారు. ఎంఆర్‌పి కంటే రైతుల నుండి రూ.113.90 అదనంగా గుంజుతున్నారు.కోరమండల్‌ కంపెనీ ఎరువులు అమ్మే ప్రైవేటు డీలర్లు, బస్తాపై కంపెనీ ముద్రించిన ఎంఆర్‌పి రూ.1,262.90కి విక్రయిస్తుండగా, ప్రభుత్వ ఆర్‌బికెలలో ఎంఆర్‌పి కంటే అధిక రేట్లు వసూలు చేయడం రైతుల్లో చర్చకు దారి తీసింది. కరోనా వేళ ధరలు తగ్గించాల్సింది పోయి ఎంఆర్‌పి కంటే ఎక్కువ వసూలు చేయడంపై అన్నదాతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నడిపే ఆర్‌బికెలలో ప్రైవేటు డీలర్ల వద్ద కంటే తక్కువ ధర ఉండాల్సింది పోయి ఎక్కువ ధర వసూలు చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.ఖరీఫ్‌లో దాదాపు 8 లక్షల టన్నుల అన్ని రకాల కాంప్లెక్స్‌ ఎరువులు కావాలని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దానిలో సుమారు లక్ష టన్నులను ఆర్‌బికెలలో అమ్మించాలనుకుంది. ఆర్‌బికెలలో విక్రయించాలనుకున్న కాంప్లెక్స్‌ ఎరువుల్లో గణనీయమైన వాటా కోరమండల్‌దేనని సమాచారం. మన రాష్ట్రంలోని కాకినాడ వద్ద గల ఆ సంస్థ ప్లాంట్‌ నుండి ఎరువులు సరఫరా అవుతున్నాయి. చాలా ఆర్‌బికెలలో అన్ని కంపెనీల ఎరువులనూ కాకుండా కోరమండల్‌ ఎరువునే ఇప్పటి వరకు అమ్మకానికి పెట్టినట్లు ఆరోపణలస్తున్నాయి. రైతులు వేరే కంపెనీ ఎరువును ఎంచుకునే ఛాన్స్‌ లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కరోనా కర్ఫ్యూలో సరైన రవాణా సదుపాయాల్లేక తమ చెంతనున్న ఆర్‌బికెలను రైతులు ఆశ్రయిస్తున్నారు. అనివార్యంగా ఎంఆర్‌పి కంటే ఎక్కువైనా అక్కడి ఎరువులనే కొంటున్నారు. కాగా ఎంఆర్‌పి కంటే ఎక్కువకు అమ్మితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, డీలర్‌షిప్‌లను రద్దు చేస్తాం అంటున్న ప్రభుత్వమే, తమ ఆర్‌బికెలలో ఎంఆర్‌పి కంటే ఎక్కువ వసూలు చేయడమేంటన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది.

Related Posts