YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మధుసూదనచారి ఎదురుచూపులు

మధుసూదనచారి ఎదురుచూపులు

వరంగల్, జూన్ 17, 
తొలినుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ను నమ్ముకుని ఉన్నారు. ఆయన వెంటే నడిచారు. కానీ కేసీఆర్ మాత్రం ఆయన వైపు చూడటం లేదు. టీఆర్ఎస్ లో సీనియర్ నేతగా ఉన్న సిరికొండ మధుసూధనాచారి పరిస్థితి రాజకీయంగా అగమ్య గోచరంగా ఉంది. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత ఆయనను కేసీఆర్ కూడా పట్టించుకోవడం లేదు. ఈసారైనా మధుసూధనాచారికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి నియోజవర్గం నుంచి మధుసూధనాచారి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. వెంటనే ఆయనకు కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన స్పీకర్ పదవిని అప్పగించారు. కానీ 2018 ఎన్నికల్లో మధుసూధనాచారి ఓటమి పాలయ్యారు. ఆయనపై గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని కేసీఆర్ టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. దీంతో నియోజకవర్గంలోనూ మధుసూధనాచారి పట్టు సంపాదించుకోలేకపోతున్నారు.అధికారంలో ఉన్నప్పుడు ఆయన కుమారుల మీద అనేక ఆరోపణలొచ్చాయి. ముగ్గురు కుమారులు మండలాల వారీగా పంచుకుని షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరించారన్న ఆరోపణలే మధుసూధనాచారి ఓటమికి కారణమని చెప్పకతప్పదు. అయితే కేసీఆర్ తో తొలి నుంచి అడుగువేసిన నేతగా మధుసూధనాచారి పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాను ఓటమి పాలయినా కేసీఆర్ తనకు ఏదో ఒక గౌరవప్రదమైన పదవి ఇస్తారని భావించారు.కానీ రెండేళ్లవుతున్నా మధుసూధనాచారికి ఎలాంటి పదవి లభించలేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మధుసూధనాచారి అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ కంటపడే ప్రయత్నం చేశారు. త్వరలో ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కాబోతున్నాయి. అందులో మధుసూధనాచారికి దక్కుతుందని ఆయన వర్గం భావిస్తుంది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన వారికి పదవులు ఇచ్చేది లేదని కేసీఆర్ భావిస్తున్నారని తెలిసింది. మొత్తం మీద మధుసూధనాచారి మరో రెండేళ్ల పాటు ఖాళీగా ఉండాల్సిందేనా? తన సహచరుడికి కేసీఆర్ పదవి ఇస్తారా? అన్నది పార్టీలో చర్చనీయాంశమైంది.

Related Posts