న్యూఢిల్లీ జూన్ 17
కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) చెల్లుబాటు గడువును పెంచింది. ఈ నెల 30 వరకూ ఇవి చెల్లుబాటు అవుతాయని గతంలో చెప్పినా.. తాజాగా దీనికి సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం ఉన్న ఈ పరిస్థితుల్లో ఫిట్‌నెస్, పర్మిట్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటి పత్రాలకు సెప్టెంబర్ 30 వరకూ చెల్లుబాటు కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రోడ్డు, రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్‌లో తెలిపింది.మరోవైపు డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు, లైసెన్సుల జారీకి సంబంధించి కూడా పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. గతంలో లైసెన్స్ జారీకి ముందు కచ్చితంగా డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేవారు. అయితే ఈ సెంటర్లలో డ్రైవింగ్ టెస్ట్ పాసైన వాళ్లకు తిరిగి టెస్ట్ అవసరం లేదని ఈ మధ్య జారీ చేసిన ఆదేశాల్లో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.