YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దీదీ వర్సెస్ ధనంకర్

దీదీ వర్సెస్ ధనంకర్

కోల్ కత్తా, జూన్ 17, 
పశ్చిమ్ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత చెలరేగిన హింస, తదితర పరిణామాలపై కేంద్రానికి ఫిర్యాదులు చేసిన గవర్నర్ జగదీప్ ధన్ఖర్.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనే ఘర్షణకు దిగుతున్నారు. దీంతో గవర్నర్ వైఖరిపై తృణమూల్ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. గవర్నర్‌పై టీఎంసీ చేసిన విమర్శలకు వామపక్ష పార్టీలు అనూహ్యంగా మద్దతుగా నిలిచాయి. ఈ విషయంలో గవర్నర్ బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని, ఆయన పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నాయి.‘ఆయన బీజేపీ వ్యక్తి కాదు.. కానీ, పనితీరు మాత్రం బీజేపీ నేత మాదిరిగానే ఉంది.. గవర్నర్ పాత్ర ఇది కాదు.. తనను తాను బీజేపీ వ్యక్తిగా గుర్తింపుకోసం పాకులాడుతున్నారు.. ముఖ్యంగా పశ్చిమ్ బెంగాల్‌లో గవర్నర్ నిర్వర్తించే విధులు ఇవి కాదు’’అని వామపక్ష కూటమి ఛైర్మన్ బిమన్ బోస్ గురువారం అన్నారు.కాగా, గవర్నర్ తన పరిధిని మించిపోయారని ఆరోపించిన తృణమూల్ కాంగ్రెస్.. తిరిగి రాష్ట్రంలో ఆయన అడుగుపెట్టరాదని డిమాండ్ చేస్తోంది. ఎటువంటి కారణం లేకుండా గవర్నర్ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై టీఎంసీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది.రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి తన ప్రతినిధులతో సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ మర్నాడు జగదీప్ దన్ఖర్ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనకు బయలుదేరే ముందు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాస్తూ.. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై మౌనంగా ఉన్నారని, బాధితుల పునరావాసం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ లేఖను ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రహ్లాద్ సింగ్ పటేల్‌తో గురువారం సమావేశం కానున్నట్టు గవర్నర్ తెలిపారు. అంతేకాదు, జాతీయ మానవహక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసి, అమిత్ షాను కలవనున్నట్టు వెల్లడించారు.‘రాజ్యాంగం, దాని నిబంధనలను పట్టించుకోని ఇటువంటి గవర్నర్‌ను ఎప్పుడూ చూడలేదు.. ప్రతీ రాజ్యాంగ నిబంధనను ఉల్లంఘిస్తున్నారు... మన రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల మండలి సూచనల మేరకు వ్యవహరించాల్సి ఉంది. కానీ ఆయన అలాంటి కట్టుబాటును పాటించరు.. ఆయన ఇష్టాలు, అభిరుచులకు అనుగుణంగా పనిచేస్తాడు’’ అని టీఎంసీ సీనియర్ నేత సౌగత్ రాయ్ దుయ్యబట్టారు.టీఎంసీ ఎంపీ మహౌ మయిత్రీ మరోసారి గవర్నర్‌ను అంకుల్ అంటూ సంబోధిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘అంకుల్ జీ జూన్ 15న ఢిల్లీకి వెళ్తున్నట్టు చెప్పారు.. గవర్నర్ సాబ్ మాకు అనుకూలంగా ఉండండి.. తిరిగి బెంగాల్‌కు రావద్దు’’ అంటూ ట్వీట్ చేశారు.

Related Posts