నిజంగా మనకు తెలిసినదెంత? తిమిరంలో కళ్లు పెద్దవి చేసుకుని వెతుకుతూనే ఉన్నాం. చీకటి తెరలు తొలగితే వెలుగు దేదీప్యమానమవుతుందని ఎవరో చెప్పగా విన్నాం. ఆ వెలుగును అన్వేషిస్తున్నాం. ఆ చీకట్లో వెలుగు వైపు అడుగులు వేస్తున్నామా, లేక మనకు తెలియకుండానే వెలుగునుంచి దూరంగా... మరీ దూరంగా వెళ్తున్నామా? ఏమో... ఏదీ చెప్పలేని స్థితిలో ఉన్నాం. జ్ఞానం కలిగి ఉన్నామని అనుకొంటున్నాం కానీ- ఆ జ్ఞానం పరిపూర్ణమా, మిడిమిడి జ్ఞానమా?
శంకరభగవత్పాదులు మనిషి తనలోని తత్వం గురించిన జ్ఞానం మొదట సంపాదించాలని అంటారు. తానెవరో తెలియనప్పుడు వేరెవరి కోసమో వెతకటంలో అర్థం లేదు. శరీరం, బుద్ధి, ఆత్మల గురించిన జ్ఞానం ప్రాథమికమైందని ఆదిశంకరులు అంటారు.
రమణమహర్షి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ప్రతి మనిషీ తానెవరో తెలుసుకోవాలని ఆయన బోధించేవారు. ఒకసారి ఆయన వద్దకు దర్శనార్థం ఒక అధికారి వచ్చాడు. ఆ అధికారి ఎంతో కొంత ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగినవాడు. రమణమహర్షితో ముఖాముఖి మాట్లాడే అవకాశం అధికారికి లభించింది. అతను సంభాషిస్తూ- 'స్వామీ నేనెవరో తెలుసుకునే ప్రయత్నం చేశాను... చేస్తూనే ఉన్నాను, కానీ నా చుట్టూ మాయ ఆవరించి ఉంది. ఆ మాయను అధిగమించలేకున్నాను' అన్నాడు. రమణమహర్షి స్పందిస్తూ- 'మాయా... అదేమిటి? దాని గురించి నాకు తెలియదే!' అన్నారు. ఆ అధికారి ఆశ్చర్యపోతూ- 'ఈ లోకమంతా మిథ్య... ఇదంతా మాయ! మీరూ నేనూ అసత్యం. పరమాత్మతత్వమే సత్యం' అని రమణమహర్షికి వివరించాడు. అలాగా అంటూ రమణులు తన పరిచారకుడితో ఒక మండుతున్న కట్టెను తెమ్మన్నారు. శిష్యులు భగభగ మండుతున్న కట్టెను తెచ్చారు. వెంటనే రమణులు ఆ అధికారిని పిలిచి అతని చేతులను ఆ మంటల కీలల్లో పెట్టమన్నారు. 'స్వామీ! చేతులు కాలతాయి. బొబ్బలెక్కి బాధ కలుగుతుంది కదా?' అన్నాడు ఆ అధికారి. దానికి రమణులు బదులు పలుకుతూ నీవూ నేనూ ఈ కట్టె... ఆ మంటా... మాయ ఆవహించిన మిథ్య అయినప్పుడు ఇక చేతులు కాలటమేమిటి? బొబ్బలెక్కడమేమిటి? నీవే మిథ్య అయితే నీకు కలిగే బాధ కూడా మిథ్యే కదా!' అన్నారు. ఇక భయం దేనికని ప్రశ్నించారు. ఆ అధికారికి ఏం చెప్పాలో తెలియలేదు. అప్పుడు రమణులు నవ్వుతూ ప్రేమ నిండిన మాటలతో- 'నాన్నా! నిన్ను అపహాస్యం చేయాలని నేనిలా ప్రవర్తించలేదు. భావంకన్నా నమ్మకం ముఖ్యం. సంపూర్ణంగా నమ్మడంవల్ల జ్ఞానతృష్ణ కలుగుతుంది' అన్నారు. ఆ అధికారిని జ్ఞానం కోసం ప్రయత్నించమని సలహా ఇచ్చారు.
జ్ఞానం అంటే ఎవరో చెప్పగా విన్నది కాదు. మాయ అంటే అదనీ ఇదనీ అనే మీమాంస విభిన్న భావాలను కలిగి ఉండటం కాదు. భగవంతుని ఉనికిని అనుభవించినవాడు మాత్రమే జ్ఞాని. అలాంటి జ్ఞానికి తెలియని విషయం ఉండదు.
ఒకసారి భగవంతుని ఉనికి తెలిసిందా... ఇక అప్పుడు మాత్రమే పరమాత్మేతరాలన్నీ మిథ్య అని తెలిసిపోతుంది. అప్పుడు మాత్రమే జ్ఞాని పాంచభౌతిక ప్రపంచాన్ని నమ్మడు. పరమాత్మ నియంత్రణలోని ఆత్మను కలిగివున్న మానవులు మిథ్యా ప్రపంచంలో నివసిస్తున్నారని తెలుసుకొంటారు. జ్ఞానోదయం అంటే ఇదే!
బోధివృక్షం కింద కూర్చొని ధ్యానంలో ఉన్న గౌతముడికి సరిగ్గా ఇదే బోధపడింది. పరమాత్ముడి ఉనికి తెలిసింది. జ్ఞానోదయం కలిగింది. అలాంటి జ్ఞానులకు నిప్పు నీరు అంటే వెరపు ఉండదు. శారీరక బాధలను అవలీలగా అనుభవిస్తారు. దారిద్య్రాన్నీ ఆస్వాదించగలరు! సుఖాలను, సిరిసంపదలను ఆశించరు. మిథ్యాప్రపంచంలో అలాంటివన్నీ దైవమాయలని వారికి తెలుసు. స్థితప్రజ్ఞతతో ప్రవర్తిస్తారు. చీకట్లోనుంచి జ్ఞానవంతులు వెలుగు వైపే అడుగులు వేస్తారు. అందుకే ఈ అచేతన వ్యవస్థలోని మానవులకు చైతన్యవంతమైన జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం కోసం పరితపించాలి. ఆ వెలుగు వైపు అడుగులు పడాలి. ఏదో ఒక రోజు వెలుగు గోచరిస్తుంది. ఆ వెలుగు కనబడిందా... ఇక ముముక్షత్వానికి మార్గం తేటతెల్లం అవుతుంది.