విజయవాడ, జూన్ 18,
రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ప్రభుత్వం మరోసారి కేసులు తిరగదోడాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ఆయనపై ప్రివిలేజ్ కమిటీలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఉంది. గతంలోనే ఆయనకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. అయితే కరోనా తీవ్రత కారణంగా ఇప్పటి వరకూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయాన్ని పక్కన పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా తీవ్రత తగ్గిన వెంటనే ప్రివిలేజ్ కమిటీ తిరిగి నోటీసులు జారీ చేసే అవకాశముంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి నామమాత్రంగానైనా తెలియ చేయకుండానే ఆయన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ చెప్పినట్లే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నడుచుకున్నారని అప్పట్లో వైసీపీ నేతలు కూడా ఆరోపించారు. అంతటితో ఆగకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంశాఖకు లేఖ రాయడం కూడా వివాదాస్పదమయింది. హోంశాఖకు రాసిన లేఖలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్ ను ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించడాన్ని కూడా వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ లేఖ వెనక తెలుగుదేశం పార్టీ పెద్దలు ఉన్నారని వైసీపీ అభిప్రాయపడుతుంది. దీనిపై సీఐడీ దర్యాప్తునకు కూడా అప్పట్లో ప్రభుత్వం ఆదేశించింది. దాదాపు ఏడాదిన్నర కాలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫలితాల పరంగా కాకున్నా మానసికంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతోనే ఇటీవల వైసీపీ ముఖ్యనేత ఒకరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రివిలేజ్ కమిటీలో కేసు పురోగతిని స్వయంగా పరిశీలించినట్లు తెలిసింది. ఆయన మరోసారి నిమ్మగడ్డకు నోటీసులు పంపాలని అధికారులను కోరినట్లు తెలిసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేసి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అయితే కరోనా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.