YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ వారసురాలిగా భారతి

జగన్ వారసురాలిగా భారతి

విజయవాడ, జూన్ 18, 
జగన్ ఎక్కువగా మాట్లాడరు, ఆయన గురించి తెలుసుకోవాలని జనాలకు ఉన్నా అసలు వీలు పడదు, ఇక జగన్ కుటుంబపరమైన విషయాలు కూడా తెలిసే అవకాశాలు చాలా తక్కువ. అయితే జగన్ సీఎం అయ్యాక మాత్రం సతీమణి భారతిని వెంటబెట్టుకుని వరసగా కొన్ని కార్యక్రమాలను హాజరవుతున్నారు. ఈ మధ్యన జగన్ వ్యాక్సిన్ వేసుకున్నపుడు భార్యాసమేతంగానే వచ్చారు. ఇక రీసెంట్ గా ఆయన గవర్నర్ తో భేటీ అయ్యే సమయంలో కూడా పక్కన భారతి ఉన్నారు. జగన్ గవర్నర్ ని కలవడం అన్నది అధికారిక కార్యక్రమం. భార్య పక్కన ఉండడం తప్పు కాదు కానీ ఆమెని వెంటబెట్టుకుని రావడమే ఈ సందర్భంగా మీడియాలో పెద్ద ఎత్తున హైలెట్ అయింది. జగన్ మీద వచ్చినన్ని పుకార్లు, ఊహాగానాలు మరే రాజకీయ నేత మీద ఈ మధ్యకాలంలో రాలేదు అంటే నిజం. జగన్ పన్నెండేళ్ల రాజకీయంలో వాస్తవాల కంటే కూడా ఊహాగానాలే ఎక్కువగా జనాలకు చేరిపోయాయి. లక్ష కోట్ల అవినీతి, జగన్ కాంగ్రెస్ తో కుమ్మక్కు అయి బెయిల్ మీద బయటకు వచ్చాడు. జగన్ బీజేపీతో దోస్తీ వెన‌క సీబీఐ కేసుల భయం ఉంది. జగన్ మళ్ళీ జైలుకు వెళ్తాడు ఇలా రకరకాలుగా ప్రత్యర్ధులు ఈ రోజుకీ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలోనే ఇంకో వార్త కూడా ఇపుడు విపరీతంగా వైరల్ అవుతోంది. జగన్ బెయిల్ రద్దు అయి జైలుకు వెళ్తే భారతి తదుపరి ముఖ్యమంత్రి అవుతారన్నదే ఆ వార్త. జగన్ తన సతీమణికి రాజకీయాలతో పాటు పాలనాపరమైన వ్యవహరాలలో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఒకవేళ అనూహ్యమైన పరిణామాలు సంభవించి తాను జైలుకు వెళ్తే సతీమణి భారతి గద్దె మీద కూర్చోవడానికి అంతా సిధ్ధం చేసి ఉంచారని కూడా అంటున్నారు. ఇక జగన్ కి అత్యంత సన్నిహితుడు సజ్జల రామకృష్ణారెడ్డి భారతికి బంధువు కావడంతో ఆయన వ్యూహాలు కూడా భారతి సీఎం కావడానికి, ఆ మీదట నిలదొక్కుకోవడానికి ఉపయోగపడతాయని అంటున్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి తన సతీమణిని జగన్ పరిచయం చేశారని, తనకు ఏమైనా కోర్టు ఇబ్బందులు ఉంటే తరువాత సీఎం గా ఆమెకే అవకాశం ఇవ్వాలని జగన్ కోరారని కూడా ప్రచారం అయితే సాగుతోంది. నిజంగా ఇవి నమ్మదగినవిగా లేకపోయినా ఆసక్తికరంగా ఉన్నాయి. జగన్ అధికారంలోకి రాకముందు ఎక్కడా భారతి కనిపించలేదు. ఇక ఆయన సీఎం అయ్యాక మాత్రం ఎక్కువగానే దర్శనమిస్తున్నారు. దానికి తోడు సొంత చెల్లెలు షర్మిల తెలంగాణాలో తన రాజకీయ భవిష్యత్తుని వెతుక్కుంటోంది. తల్లి విజయమ్మకు వయోభారంతో పాటు రాజకీయ ఆసక్తి కూడా లేదు. దాంతో జగన్ వారసులు ఎవరు అంటే కచ్చితంగా భారతినే ఎవరైనా చెబుతారు. జగన్ ఇంట్లోనే రాజకీయం ఉంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంలో ఉంటున్న భారతికి రాజకీయాలు వంటబట్టకుండా ఉండవు అంటే ఎవరైనా నమ్మగలరా. ఇక జగన్ సతీమణిగా, సగభాగంగా ఆయన పాలనలో, రాజకీయాల‌లో ఆమె పాత్ర లేకుండా ఉంటుందా. మొత్తానికి జగన్ని ప్రత్యర్ధులు టార్గెట్ చేస్తూనే భారతి మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. మరి ఈ ఊహాగానాలు నిజమవుతాయా. జగన్ ని మళ్ళీ జైలుకు పంపేటంత సీన్ ఉంటుందా. చూడాల్సిందే

Related Posts