గుంటూరు, జూన్ 18,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ను ఆ సెంటిమెంట్ భయపెడుతుందా? అంటే అవుననే అంటున్నారు. వరసగా రెండు సార్లు ఓటమి ఆయనకు సెంటిమెంట్ గా వస్తుంది. దీంతో 2024 ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది చంద్రబాబులో కలవరం మొదలయింది. పైగా జగన్ సంక్షేమ పథకాలతో ప్రజలను తన వైపునకు తిప్పుకుంటున్నారు. కులాల వారీగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.1999లో విజయం సాధించిన తర్వాత చంద్రబాబు పదేళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉండి పోవాల్సి వచ్చింది. అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించింది. చంద్రబాబు ఎన్ని కూటములు ఏర్పాటు చేసినా ఫలితం దక్కలేదు. అయితే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. పదేళ్ల తర్వాత 2014లో చంద్రబాబుకు విభజన జరిగిన ఏపీలో మళ్లీ అధికారం దక్కింది.మరోసారి పదేళ్ల పాటు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండక తప్పదన్న సెంటిమెంట్ పార్టీ నేతలను పట్టి పీడిస్తుంది. ఈసారి అధికారంలోకి రాలేకపోతే పార్టీ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశముంది. రెండేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులను టీడీపీ ఎదుర్కొంటుంది. కేసులతోనే కాకుండా ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొనడటంతో నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో చంద్రబాబు సెంటిమెంట్ రిపీట్ కాకుండా ఉండాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కూటమిని ఏర్పాటు చేసి విజయం సాధించాలన్నది చంద్రబాబు లక్ష్యంగా ఉంది. అందుకోసమే ఇప్పటి నుంచే ఆయన పావులు కదుపుతున్నారు. బీజేపీ, జనసేనలతో కలసి వెళితేనే తనకు మరోసారి విజయం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారు. కూటమి ఏర్పాటయితే మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన సీట్ల విషయంలో కూడా ఇప్పటి నుంచే ఆయన జాబితాను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద పదేళ్ల ప్రతిపక్షం సెంటిమెంట్ నుంచి చంద్రబాబు బయటపడాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు.