హైదరాబాద్, జూన్ 18,
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు పెంచిన జీతాలు జులై ఫస్ట్‌కు వచ్చే అవకాశం కనపించడం లేదు. జులై ఒకటిన ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యేది పాత జీతాలేనని తెలుస్తోంది. 30 శాతం ఫిట్‌మెంట్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నా, ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చినా శాలరీ ఫిక్సేషన్‌కు సంబంధించిన ప్రక్రియ ఆలస్యం కావడంతో పాత జీతమే ఇవ్వనున్నట్టు సమాచారం. శాలరీ ఫిక్సేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత.. పెరిగిన జీతాన్ని సప్లిమెంటరీ శాలరీగా ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.అది సాధ్యం కాకుంటే ఆగస్టు ఒకటిన జమ చేసి జులై జీతంతో పాటు జూన్‌కు సంబంధించిన బకాయిలు చెల్లించే అవకాశముంది. పీఆర్సీ ఫిట్‌మెంట్ మేరకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్ అప్‌గ్రేడ్ చేసేందుకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, ట్రెజరీ శాఖ ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నాయి. ఇది సిద్ధం కావడానికి ఇంకా మూడు నుంచి నాలుగు రోజులు పట్టవచ్చని అధికారులు చెప్తున్నారు. ఈలోగా ఫైనాన్స్ నుంచి శాలరీ ఫిక్సేషన్‌పై ఇంటర్నర్ సర్క్యులర్ జారీ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ వ్యక్తిగత వివరాలు దానిలో నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త సాఫ్ట్‌వేర్ సిద్ధం కాగానే ఉద్యోగుల ప్రస్తుత బేసిక్ వేతనం, గ్రేడ్, తదితర వివరాల ఆధారంగా ఫిట్‌మెంట్తో పొందే వేతనం ఆటో అప్డేషన్ అవుతుంది. ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసం హైదరాబాద్‌లోని ప్రభుత్వ శాఖలు ఈ నెల 19 నాటికి, జిల్లాల్లోని శాఖలు 23 నాటికి ట్రెజరీకి బిల్లులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఇతరత్రా సమస్యలతో ఈ మొత్తం ప్రాసెస్ ఆలస్యం కానుంది. దీంతో జూన్ నెలకు సంబంధించి పెరిగిన జీతం జులై నెల మధ్యలో సప్లిమెంటరీ జీతంగా ఇచ్చే అవకాశమున్నట్టు అధికారులు చెప్తున్నారు. అది సాధ్యం కాకపోతే ఆగస్టులో ఇచ్చే జీతంతో పాటు బకాయిలు చెల్లిస్తారు.