హైదరాబాద్, జూన్ 18,
ఇంటర్ నిర్వహణలో ప్రభుత్వ నిర్ణయాలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. స్పష్టతలేని ఉత్తర్వుల వలన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తనున్నాయి. ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయకుండా పై తరగతికి విద్యార్థులను ప్రమోట్ చేసిన ప్రభుత్వం మార్కుల కేటాయింపులు ఏ విధంగా చేపట్టనున్నారో తెలుపలేదు. విద్యార్థులకు ఫస్టియర్ మార్కులు కేటాయించాల్సి వస్తే తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలి. ఏ ఏ అంశాలతో, ఏ సమయంలో పరీక్షలు నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సెకండ్ ఇయర్ చదువుతున్న వారికి ఫస్టియర్ సిలబస్‌తో పరీక్షలు నిర్వహించయడం వలన విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవల్సివస్తుంది.కరోనా వ్యాధి విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తుంది. ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో విద్యావ్యవస్థను కాపాడాల్సిన ప్రభుత్వం స్పష్టత లేని నిర్ణయాలను తీసుకుంటుంది. భవిష్యత్తుల్లో ఎదురయ్యే సమస్యలను ఆలోచించకుండా ప్రస్తుత పరిస్థితులను అనుగుణంగా మాత్రమే స్పష్టతలేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందుకు గురయ్యే అవకాశాలున్నాయి. ఉన్నత తరగతులకు విద్యార్థులను ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం మార్కుల కేటాయింపుల్లో ఎలాంటి నిర్ణయాలను చేపట్టడం లేదు.
కొవిడ్-19 నుంచి విద్యార్థులను కాపాడేందుకు ప్రభుత్వం పాఠశాల, జూనియర్ కళాశాలల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసింది. దీంతో జూనియర్ కళాశాలలోని 9,66,152 మంది విద్యార్థుల పై తరగతులకు ప్రమోట్ అయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,80,808 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 2,36,430 మంది బాలురు, 2,44,378 మంది బాలికలు ఉన్నారు. సెకండ్ ఇయర్‌లో 4,85,344 మంది ఉండగా వీరిలో బాలురు 2,46,378 మంది, బాలికలు 2,38,966 మంది ఉన్నారు.పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేసిన ప్రభుత్వం ఫస్టియర్ విద్యార్థుల మార్కుల కేటాయింపులో స్పష్టతను ఇవ్వలేదు. సెకండ్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఫస్టియర్ మార్కుల ఆధారంగా మార్కులను నిర్ణయించి మెమోలను అందించనున్నారు. ఈ క్రమంలో ఫస్టియర్ విద్యార్థులకు ఏ ప్రాతిపాదికన మార్కులు కేటాయించనున్నారనే అంశాలను వెల్లడించలేదు. ఫస్టియర్ పరీక్షలను రద్ద చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించకపోవడంతో భవిష్యత్తులో పరీక్షలను నిర్వహించే అవకాశాలున్నాయని సందేహాలొస్తున్పాయి. మార్కుల కేటాయింపులు చేపట్టాల్సి వస్తే తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలి. ఈ క్రమంలో ఏ ప్రతిపాదికన పరీక్షలు నిర్వహించనున్నారనే ఆలోచనలు వస్తున్నాయి. ఏ ఏ అంశాలతో ఏ సమయంలో నిర్వహిస్తారనేది గందరగోళాన్ని సృష్టిస్తుంది. సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఫస్టియర్ సిలబస్‌తో పరీక్షలను నిర్వహించడం వలన విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనున్నారు. ప్రభుత్వం భవిష్యత్తు పరిస్థితులను ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు.