న్యూఢిల్లీ జూన్ 19
దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు వ్యాక్సినేషన్ చాలా ముఖ్యమైనదని పేర్కొంది. ఈమేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారంనాడు లేఖ రాశారు.కోవిడ్ అన్‌లాన్ ప్రక్రియతో రోజువారీ కార్యక్రమాలు పునరుద్ధరణ జరుగుతున్న క్రమంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తుండాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించడం, టెస్ట్-ట్రాక్-ట్రీట్- వ్యాకినేట్ స్ట్రాటజీని అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపవద్దని కోరారు. పరిస్థితులను కూలంకషంగా అంచనా వేసిన తర్వాతే ఆంక్షలను విధించాలా, సడలించాలా అనే విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తిరిగి కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు కేసులు తగ్గాయా లేదా అనేది నిర్ధారించుకోవడం అత్యవసరమని, మొత్తం ప్రక్రియను జాగ్తత్తగా మదింపు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు. కోవిడ్ బిహేవియర్, టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ అనే ఐదంచెల వ్యూహాన్ని అనుసరించాలని, తిరిగి ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా చూసుకునేందుకు కోవిడ్ నిబంధనలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని అజయ్ భల్లా సూచించారు.