న్యూఢిల్లీ జూన్ 19
జమ్మూకశ్మీర్‌లో రాజకీయ ప్రక్రియకు వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా అక్కడి అన్ని ప్రాంతీయ పార్టీలతో కేంద్ర ఈ నెల 24న సమావేశమయ్యే అవకాశం ఉంది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్రం చర్చించే వీలుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనుండగా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఇతర కేంద్ర నేతలు హాజరవుతారు. చర్చల కోసం నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ చైర్‌పర్సన్ మెహబూబా ముఫ్తీ, జమ్మూ అండ్ కశ్మీర్ అప్ని పార్టీ (జేకేఏపీ) అల్టాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జద్ లోన్ తదితరులను ఆహ్వానించే ప్రక్రియను కేంద్ర నాయకత్వం ప్రారంభించినట్టు అధికారవర్గాలు తెలిపాయి.ఇటీవల వరకూ రాష్ట్రంగా ఉన్న జమ్మూకశ్మీర్‌కు ఫరూక్, మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కాగా, జూన్ 24న సమావేశం విషయమై తనకు ఫోన్ కాల్ వచ్చినట్టు మెహబూబూ ముఫ్తీ ధ్రువీకరించారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పార్టీ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను కేంద్రం రద్దు తర్వాత ఈ తరహా సమావేశం జరగడం ఇదే ప్రథమం.మరోవైపు, కేంద్రంతో చర్చలకు అవకాశంపై సీపీఎం నేత, పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) ప్రతినిధి ఎం.వై.తరిగమిని సంప్రదించినప్పుడు, న్యూఢిల్లీ నుంచి తనకు ఇంకా ఎలాంటి పిలుపు రాలేదని, ఒకవేళ వస్తే స్వాగతిస్తామని చెప్పారు. కేంద్రంతో అర్ధవంతమైన చర్చలకు తాము ఎప్పుడూ తెలుపులు మూసివేయలేదని చెప్పారు. ఎన్‌సీ,పీడీపీ సహా పలు పార్టీల కూటమిగా ఇటీవల పీఏజీడీ ఏర్పడింది.చర్చలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా తాము స్వాగతిస్తామని, ప్రజాస్వామ పునరుద్ధరణకు యంత్రాంగం ఏర్పాటు చేయడం, జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్రప్రతిపత్తి మీదనే చర్చలు ఉండాలని తాము గతంలోనే స్పష్టం చేశామని జేకేఏపీ అధ్యక్షుడు బుఖారి చెప్పారు. కాగా, కేంద్రంతో చర్చల్లో బీజేపీ జమ్మూకశ్మీర్ విభాగాలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.