మనిషి అజ్ఞానంలో జన్మిస్తాడు. కాని అతడు అజ్ఞానంలోనే జీవితాన్ని గడిపేయకూడదు. పశుపక్ష్యాదులు కూడా అజ్ఞానంలోనే పుడతాయి. అయితే వాటి జీవితాలు అజ్ఞానంలోనే కొనసాగి అందులోనే అంతమవుతాయి. మానవుడిని అజ్ఞానాంధకారం నుంచి బయటపడేసేవాడే గురువు. మనిషికి తన గురించిన జ్ఞానం ఉండదు. జీవిత లక్ష్యమేమిటన్న జ్ఞానం ఉండదు. ఈ విషయాల్లో అతడు చీకట్లో ఉన్నట్లే. అదే అజ్ఞానాంధకారం. ఈ అజ్ఞానాంధకారాన్ని తొలగించి హృదయ పరివర్తనం తేగలిగేవాడే గురువు.
శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ అనేవి వరుసగా ఒకదానిపైన ఒకటి ఉంటాయి. అంటే వాటి అధికార క్రమం ఆ విధంగా ఉంటుంది. మనిషి ప్రయత్నపూర్వకంగా ఎక్కువ సమయం బుద్ధిస్థితిలో ఉంటే దానికి దగ్గరలోనే ఉన్నట్టి ఆత్మ గురించి తెలిసికొనే అవకాశాన్ని మెండుగా పొందుతాడు. కాని మానసిక స్థితికి దిగజారితే ఆత్మస్థితికి దూరమై అష్టకష్టాలు పడతాడు.
యుద్ధరంగంలో ప్రవేశించినపుడు బుద్ధిస్థాయిలో ఉన్న అర్జునుడు అక్కడ ఇరుసేనలలోని యోధులను చూడగానే హృదయం ద్రవించి చింతకు లోనయ్యాడు. అంటే మానసిక స్థితిలోకి వచ్చేశాడు. దానితో అతని శరీరం పట్టు తప్పింది. ఎప్పుడైతే మనసు దుర్భలమవుతుందో శరీరం అశక్తతకు గురవుతుంది. అర్జునుడి పరిస్థితి ఇదే. అయితే అతడు తన స్థితిని జగద్గురువైన శ్రీకృష్ణునికి విన్నవించి ఉపదేశం చేయమని అడిగాడు.
‘‘మానసిక బలహీనత కారణంగా నా స్వధర్మ విషయంలో మోహం ఆవరించింది. నాకు శాంతి కరువైంది, ఈ పరిస్థితులలో నాకు ఏది మంచిదో నిశ్చయంగా చెప్పమని నేను నిన్ను అడుగుతున్నాను. నేనిపుడు నీకు శిష్యుడనయ్యాను, నీకు శరణాగతుడనయ్యాను, దయచేసి నాకు ఉపదేశమివ్వు’’ అని అర్జునుడు తన స్థితిని పూర్తిగా వివరించడమే కాకుండా తనకు ఏ విధంగా లాభం చేయాలో కూడా చెప్పాడు. ఇదే అజ్ఞానాంధకారం తొలగడానికి మొదటి అడుగు. ఆధ్యాత్మిక జీవనంలో తొలి గుర్వాశ్రయం. దానినే ‘ఆదౌ గుర్వాశ్రమం’ అని శాస్త్రాలు చెబుతున్నాయి.
అర్జునుడి దీనస్థితిని గుర్తించిన ఆది జగద్గురువైన కృష్ణపరమాత్మ అతనికి మొదటిపాఠం చెబుతూ ‘‘నువ్వు దేహానివి కాదు’’ అనే విషయాన్ని తెలియజేశాడు. ‘‘అర్జునా! నీవు దుఃఖించదగని విషయం గురించి దుఃఖిస్తున్నావు. పండితులు జీవించి ఉన్నవారిని గురించి గాని, మరణించినవారిని గురించి గాని దుఃఖించరు. ప్రజ్ఞతో కూడిన మాటలు చెబుతూనే నువ్వు అనవసరంగా దుఃఖిస్తున్నావు’’ (2-11) అని తొలిసందేశం ఇచ్చాడు.
‘‘నీవు శరీరానివి కాదు’’ అనే భగవద్గీత తొలిపాఠం యొక్క ముఖ్య ఉద్దేశం శరీరాన్ని గాలికి వదిలేయమని కాదు. నీవు శరీరానివి కాదు, కానీ శరీరం నీది. దానిని చక్కగా కాపాడుకుంటూ మానవ జీవిత లాభాన్ని పొందమని చెప్పడమే ఆ పాఠం ఉద్దేశం. దేహాన్ని ఆత్మగా భావించడం దేహాత్మబుద్ధిగా చెప్పబడుతుంది. మనిషి దాని నుంచి బయటపడాలి. తెలివి కలిగిన మానవుడు గురు నిర్దేశంలో గీతాజ్ఞానం ద్వారా శరీరాన్ని, మనసును, బుద్ధిని, ఆత్మను విడివిడిగా చూడగలిగి ప్రతీ దానిని పోషిస్తూ మానవజన్మ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవాలి.
శరీరం స్థూలమైనది. అంటే కంటికి కనిపించేది. మనసు సూక్ష్మమైనది, కంటికి కనిపించదు. దానిని నియంత్రించాలంటే చాలా కష్టపడాలి. బుద్ధి ఇంకా సూక్ష్మమైనది. దానిని ఉపయోగించాలంటే ఇంకెంతో కష్టపడాలి. వీటన్నింటి కంటే ఆత్మ మరింత సూక్ష్మమైనది. ఇక దానిని అనుభూతమొనర్చుకోవడానికి పడాల్సిన పరిశ్రమ గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. ఈ విధంగా గీతలోని తొలిపాఠంలో మనిషి జాగృతుడై అసలైన కార్యశీలుని తనలో మేల్కొలుపుతాడు. అటువంటి వ్యక్తి అన్ని రంగాలలో రాణించి సకల శుభాలను పొందుతాడు. నిజమైన ఆత్మదర్శి విరాగి అవుతాడు. తాను జీవన సాఫల్యాన్ని సాధించడమే కాకుండా అందరూ జీవితంలో సఫలురయ్యే మార్గం చూపిస్తాడు. అతడే భగవద్గీత మహిమలను సర్వత్రా చూపగలడు.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో