YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నీటి జాడ ఏదీ..?

నీటి జాడ ఏదీ..?

జిల్లాలో ఊహించని విధంగా భూగర్భ జలాల నీటి పడిపోతోంది. గత ఏడాదితో పోల్చితే 1.01 మీటర్లు భూగర్భ జలం అడుగంటింది. వరుణుడు ముఖం చాటేయటంతో ఒకవైపు లోటు వర్షపాతం, మరోవైపు భూమిలోకి ఇంకే నీటిశాతం తగ్గిపోవటం భూగర్భ జలాలపై ప్రభావం చూపిస్తున్నాయి. మెట్టప్రాంతమైన పశ్చిమ కృష్ణాతో పాటు డెల్టాలోనూ తాగు, సాగునీటి అవసరాలకు భూగర్భ జలాలనే వినియోగిస్తుండటంతో నీటిమట్టం పడిపోవటానికి కారణంగా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆరు నెలలుగా చినుకు జాడ కరవైంది. నిన్నామొన్నటి వరకు చెరువులు, వాగులు వట్టిపోయి దర్శనమిచ్చాయి. సాగర్‌ జలాలు, పట్టిసీమ నీరు విడతల వారీగా విడుదల చేయటం వల్ల ప్రస్తుతం కొన్ని చెరువులు, వాగులు జలకళ సంతరించుకున్నాయి. ఇటీవల వరకు ఉపరితలంలో నీరు లేకపోవటంతో భూగర్భ జలమట్టం పడిపోతూ వచ్చింది. తొలకరి నుంచి ఆగస్టు వరకు కురిసిన వర్షాలతో గత ఏడాది నవంబరులో మాత్రమే నీటిమట్టం పెరగ్గా మార్చి, ఏప్రిల్‌ నుంచి అడుగంటుతూ వస్తోంది. జిల్లాలో 108 ప్రాంతాల ద్వారా భూగర్భ జలాల వివరాలను నమోదు చేస్తున్నారు. మూడు రోజులుగా 12 కేంద్రాలు పనిచేయటం లేదు. ప్రస్తుతం అనూహ్యంగా పడిపోవటంతో ఫిజియో మీటర్ల ద్వారా భూగర్భ జలాల తీరును లెక్కిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఎక్కువ నీరు వినియోగిస్తున్నారనే విషయమై భూగర్భ శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వస్తున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం భూగర్భ జలాలను పెంపొందించే మార్గాలను అన్వేషించాలని, సగటు నీటి మట్టం 8 మీటర్లకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలంటూ భూగర్భ జలశాఖను ఇటీవల ఆదేశించింది. భూగర్భ జలాలను పరిరక్షిస్తూ నష్టనివారణ దిశగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే అంశంపై కసరత్తు జరుగుతోంది.

ప్రాణకోటికి జీవనాధారం నీరు. నిత్య జీవితంలో ప్రతి అంశం నీటితోనే ముడిపడి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదకరస్థాయిలో నీటి మట్టం పడిపోతున్న వంద ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించగా జిల్లాలో ఐదు ప్రాంతాలు నమోదు కావడం ఆందోళన  కలిగిస్తోంది. జిల్లాలోని ముసునూరు, నూజివీడు, ఘంటసాల, బాపులపాడు మండలాల్లో భూగర్భ జలాలు పాతాళానికి చేరకుంటున్నాయి. ముసునూరు మండలం సూరేపల్లిలో 69.69, ముసునూరులో 33.12, నూజివీడు మండలం పల్లెర్లమూడిలో 48.25, ఘంటసాల మండలం శ్రీకాకుళంలో 43.94, బాపులపాడు మండలం సింగన్నగూడెంలో 32.38 మీటర్లలో భూగర్భ జలాలు పలకరిస్తున్నాయి. తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం బోరుబావులు తవ్వినా జలం జాడ కానరాకపోవటం లేదు. ఫలితంగా సుమారు రూ.30 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటూ ఈ ప్రాంతాల్లో వాల్టా చట్టాన్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుమతులు ఇస్తున్నారు. సాధారణంగా 8 మీటర్లలో భూగర్భ నీటిమట్టం ఉండాలి. కానీ ఇక్కడ 30 మీటర్ల దిగువకు చేరుకోవటం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న పరిస్థితికి అద్దం పడుతోంది.

జిల్లా సగటును పరిగణనలోకి తీసుకుంటే భూగర్భ నీటి మట్టం ప్రస్తుతం 11.82 మీటర్లు ఉండగా రాష్ట్రస్థాయి సగటుతో పోల్చితే 0.72 మీటర్లు అధికంగా ఉంది. జిల్లాలోని 49 మండలాల్లో భూగర్భ నీటిమట్టం అడుగంటుతున్న తరుణంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆశాజనకంగా ఉండటం ఊరటనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 100 ప్రాంతాల్లో తొమ్మిది ప్రాంతాలు జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ మీటరు నుంచి మూడు మీటర్లలోపే భూగర్భ జలాలు పలకరిస్తున్నట్లు గుర్తించారు. మెట్టప్రాంతమైన జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో 0.29 మీటర్లలో నీటి మట్టం ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మచిలీపట్నంలో 1.41 మీటర్లు, తిరువూరు మండలం అక్కపాలెంలో 1.41, కృత్తివెన్నులో 1.45, కోడూరులో 1.53, నాగాయలంకలో 1.67, కలిదిండిలో 2.37, గూడూరులో 2.47, తిరువూరు మండలం రోలుపడిలో 2.56 మీటర్లలో నీటి మట్టంగా ఉంది. సముద్రతీర ప్రాంతాల్లో నీటిమట్టంపైన ఉండటం సహజమే అయినప్పటికీ పశ్చిమ కృష్ణా పరిధిలోని తిరువూరు, జగ్గయ్యపేటల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆశాజనకంగా ఉండటానికి కారణాలను అన్వేషిస్తున్నారు.

మితిమీరిన వాడకం వల్లే పాతాళానికి చేరుకుంటున్న భూగర్భ జలాలు పెనుసవాళ్లను విసురుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో నీటిమట్టం బాగా తగ్గిపోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. నీరు- చెట్టు కార్యక్రమంలో భాగంగా చెరువుల పూడికతీత, వాగుల నీటి ప్రవాహానికి అడ్డుగా ఆనకట్టలు, చెక్‌డ్యాంలు నిర్మించటం, జలసంరక్షణను ఉద్యమంగా చేపడుతూ జలవనరుల శాఖ, నరేగా ఆధ్వర్యంలో 39 రకాల పనులను చేపడుతోంది. దీనిలో ప్రధానంగా నీటిపొదుపు, వృథాను అరికట్టడం, పరిరక్షించటం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించటమే లక్ష్యంగా పెట్టుకుంది. మూడేళ్లుగా నీటికుంటలు, ఇంకుడుగుంతల తవ్వకం పనులకు భారీ లక్ష్యాలను నిర్దేశిస్తూ సవాళ్లను అధిగమించే దిశగా చర్యలు చేపడుతోంది. దీంతో భూగర్భ జలాల పరిస్థితి జిల్లాలో కాస్తా ఆశాజనకంగా ఉండటానికి దోహదం చేసింది. నదుల అనుసంధానం మాదిరిగానే వాగులు, చెరువులను అనుసంధానం చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. సాధ్యమైనంత వరకు వర్షాకాలంలో కురిసే ప్రతి నీటిబొట్టును భూమిలో ఇంకింపజేయాలనే సమున్న ఆశయంతో పూర్తి నిధులను ప్రభుత్వమే భరిస్తూ, ప్రజలు, రైతులకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా ప్రజలు కూడా సమాయాత్తం కావాల్సి ఉంది.

Related Posts